ASIAN రిలేస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన..
ASIA: చైనాలోని షావోషింగ్‌లో జరిగిన ASIAN రిలేస్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ చివరి రోజు భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.
శ్రాబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివాంకర్, తమన్నాతో కూడిన భారత క్వార్టెట్ 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసింది. ఇది ఈ సీజన్‌లో ఆ జట్టు నమోదు చేసిన అత్యుత్తమ టైమ్‌గా నిలిచింది.
మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో కూడా భారత్ మరో పతకం ఖాతాలో వేసుకుంది. తీర్థేశ్ శెట్టి, పూవమ్మ ఎంఆర్, భరత్ శ్రీధర్, నీరూ పఠాక్‌తో కూడిన భారత జట్టు 3:17.06 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది.
అంతకుముందు జరిగిన మిక్స్‌డ్ 4×100 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకం సాధించింది. ప్రణవ్ గౌరవ్, తమన్నా, అనిమేష్ కుజూర్, ఎస్‌ఎస్ స్నేహ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.



