LB nagar లో భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..

June 23, 2026 10:29 AM
Police investigate murder case at LB Nagar Hyderabad.

పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వచ్చిన హత్య కేసు..

హైదరాబాద్‌: LB Nagar పరిధిలో భర్తను హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు బోడా నర్సింగ్ (36) కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎన్‌టీఆర్ నగర్‌లో నివసించేవాడు. వీరి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా, కొరవి మండలం, తట్టుపల్లి గ్రామం.

కొంతకాలంగా స్వరూపకు తమ గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు నర్సింగ్‌కు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటపడిన తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో భర్త తన సంబంధానికి అడ్డుగా మారాడని భావించిన స్వరూప అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

జూన్ 20న చిన్న కుమార్తెను కొబ్బరికాయ తీసుకురావాలని సమీపంలోని దుకాణానికి పంపిన తర్వాత, నర్సింగ్ ఛాతిపై కూర్చొని దుపట్టాతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం అదే దుపట్టాను మంచానికి కట్టి నర్సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించేలా ప్రయత్నించినట్లు వెల్లడించారు.

ఘటనాస్థలికి చేరుకున్న LB Nagar పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణ కావడంతో ఇది హత్య కేసుగా మారింది.

దర్యాప్తులో భాగంగా స్వరూప మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. విచారణలో స్వరూప నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media