ఇంటి ముందు ఆడుకుంటుండగా ఘటన
సంఘటనపై ఘట్కేసర్ పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్: Ghatkesar లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన 15 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
సంపంగి మహేష్ నాగర్కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన వ్యక్తి. జీవనోపాధి కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి Ghatkesar లోని శివరెడ్డిగూడకు వలస వచ్చాడు. మహేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, ఆయన భార్య కూలీ పనులు చేస్తోంది.
మంగళవారం సాయంత్రం వారి కుమార్తె నైనిక ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, అనుకోకుండా అక్కడే ఉన్న ఓపెన్ నీటి సంపులోకి వెళ్లిపోయింది. ఆ ఘటనను వెంటనే ఎవ్వరూ గమనించలేదు.
కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. అనుమానం వచ్చి నీటి సంపును పరిశీలించగా, అందులో చిన్నారి తేలుతూ కనిపించింది.
వెంటనే కుటుంబ సభ్యులు బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



