మూడు రోజుల సీషెల్స్ పర్యటనలో ప్రత్యేక కానుకలు
భారతీయ సంప్రదాయ కళలు, చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిన ప్రధాని
న్యూఢిల్లీ: PM Modi ఇటీవల ముగిసిన మూడు రోజుల సీషెల్స్ పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత నాయకులు, వారి జీవిత భాగస్వాములకు భారతీయ హస్తకళలు, చేనేత సంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రత్యేక బహుమతులు అందించారు.
జూన్ 27 నుంచి 29 వరకు జరిగిన ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అధ్యక్షుడికి మురాదాబాద్ బ్రాస్ తాబేలు
సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీకి ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఇత్తడి తాబేలు శిల్పాన్ని ప్రధాని బహుమతిగా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా “బ్రాస్ సిటీ”గా పేరుగాంచిన మురాదాబాద్ కళాకారుల నైపుణ్యాన్ని ఈ శిల్పం ప్రతిబింబిస్తుంది.
పర్యటనలో భాగంగా మోదీ సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్‌లోని జెయింట్ టార్టాయిస్ సంరక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించారు.
ఫస్ట్ లేడీకి మహేశ్వరి సిల్క్ స్టోల్, బిద్రివేర్ బాక్స్
సీషెల్స్ ఫస్ట్ లేడీ వెరోనిక్ హెర్మినీకి మహేశ్వరి సిల్క్ స్టోల్‌తో పాటు బిద్రివేర్ బాక్స్‌ను ప్రధాని అందించారు.
మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి సిల్క్ తేలికైన వస్త్ర నిర్మాణం, అందమైన డిజైన్లు, సిల్క్-కాటన్ మేళవింపుతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన బిద్రివేర్ కళలో జింక్, రాగి మిశ్రమంపై వెండి నగిషీలు చెక్కడం ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తుంది.
ఉపాధ్యక్షుడికి సిక్కిం ఆర్కిడ్ పెయింటింగ్
సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లైకు సిక్కింకు చెందిన ఆర్కిడ్ చిత్రకళను ప్రధాని బహుమతిగా ఇచ్చారు.
ఈ చిత్రంలో భారత జాతీయ పక్షి నెమలి, ఆర్కిడ్ పుష్పాలు, పూల తీగలను అందంగా చిత్రించారు. నెమలి భారత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక కాగా, ఆర్కిడ్ సీషెల్స్ జాతీయ పుష్పం కావడం వల్ల ఈ కళాఖండానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
సెకండ్ లేడీకి కంచివరం పట్టు వస్త్రం
సీషెల్స్ సెకండ్ లేడీ లీనా పిల్లైకి తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కంచివరం పట్టు వస్త్రాన్ని ప్రధాని బహుమతిగా అందించారు.
మల్బరీ సిల్క్‌తో నేసిన ఈ వస్త్రం బలమైన నాణ్యత, మెరిసే తీరు, బంగారు జరీ పనితనానికి ప్రసిద్ధి చెందింది. మరూన్ రంగు నేపథ్యంపై బంగారు జరీ డిజైన్లు, ఎరుపు, ఆకుపచ్చ, బంగారు అంచులతో ఈ వస్త్రం ఆకట్టుకుంటుంది.
జాతీయ అసెంబ్లీ స్పీకర్‌కు తోడా శాలువా
సీషెల్స్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నెస్టాకు తమిళనాడులోని నీలగిరి కొండల్లో నివసించే తోడా గిరిజన సమాజానికి చెందిన సంప్రదాయ ఎంబ్రాయిడరీ శాలువాను బహుమతిగా ఇచ్చారు.
‘పుఖూర్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ చేతి ఎంబ్రాయిడరీ పూర్తిగా చేతిపనితో తయారవుతుంది. సంప్రదాయ వేడుకల్లో ఉపయోగించే ఈ శాలువా గిరిజన సంస్కృతి, వారసత్వం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
భారతీయ కళలు, చేనేత సంప్రదాయం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే సీషెల్స్ సాంస్కృతిక వారసత్వానికి భారత్ ఇచ్చే గౌరవాన్ని ఈ బహుమతులు ప్రతిబింబిస్తున్నాయి.



