రాష్ట్ర జట్టులో అవకాశం రాకపోవడమే జీవితాన్ని మార్చిన మలుపు
తండ్రి తీసుకున్న ఒక్క నిర్ణయమే క్రికెట్ కెరీర్‌కు బలమైన పునాది
న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తన క్రికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.
పాఠశాల రోజుల్లో ఢిల్లీ రాష్ట్ర జట్టులో చోటు దక్కకపోవడంతో తన తండ్రి విశ్వనాథన్ కుటుంబాన్ని వెంటనే కేరళకు మార్చాలని నిర్ణయించారని తెలిపారు. అదే తన క్రికెట్ కెరీర్లో కీలక మలుపుగా మారిందన్నారు.
JioStar కార్యక్రమం **’Superstars’**లో మాట్లాడిన సంజూ శాంసన్, చిన్నప్పటి నుంచి ఢిల్లీ రాష్ట్ర జట్టుకు ఆడాలన్న కల ఉండేదని చెప్పారు. తన స్నేహితులు DDCA జాకెట్లు వేసుకుని రాష్ట్ర జట్టుకు ఆడుతున్న విషయాలు చెప్పడం తనకు ప్రేరణగా మారిందన్నారు.
రాష్ట్ర జట్టు ఎంపిక కోసం పలుమార్లు ట్రయల్స్‌లో పాల్గొన్నానని, స్టేట్ క్యాంప్‌లకు కూడా ఎంపికయ్యానని చెప్పారు. మంచి పరుగులు చేసినప్పటికీ తుది జట్టులో మాత్రం తన పేరు రాలేదన్నారు. ఆ రోజు ఇంటికి వెళ్లిన వెంటనే తన తండ్రి కుటుంబాన్ని కేరళకు మార్చాలని నిర్ణయించారని గుర్తు చేసుకున్నారు.
తల్లి పిల్లలు కనీసం పదో తరగతి పూర్తయ్యే వరకు వేచి చూద్దామని చెప్పినా, తండ్రి మాత్రం ఆలస్యం చేయకుండా మూడు రోజుల్లోనే ప్రయాణ ఏర్పాట్లు చేశారని తెలిపారు.
అనంతరం కుటుంబమంతా కేరళకు వెళ్లిందని, అక్కడి నుంచే కేరళ రాష్ట్ర జట్టుతో తన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైందన్నారు.
ఢిల్లీలోనే క్రీడలపై ఆసక్తి పెరిగింది
తన బాల్యం మొత్తం ఢిల్లీలోనే గడిచిందని సంజూ చెప్పారు. తన తండ్రి ఢిల్లీ పోలీస్ ఫుట్‌బాల్ జట్టులో ఉండటంతో చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగిందన్నారు.
GTB నగర్ పోలీస్ క్వార్టర్స్‌లో నివసించే సమయంలో వీధుల్లో టెన్నిస్ బంతితో గల్లీ క్రికెట్ ఆడేవాళ్లమని చెప్పారు. అదే తనలో క్రికెట్‌పై ప్రేమ పెరగడానికి కారణమైందన్నారు.
తన తండ్రి ఎప్పుడూ ఫుట్‌బాల్ ఆడాలని ఒత్తిడి చేయలేదని తెలిపారు. బ్యాటింగ్‌లో తనకు ప్రతిభ ఉందని గుర్తించిన తండ్రి, తనను, తన సోదరుడిని క్రికెట్ వైపు మళ్లించారని వెల్లడించారు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన జ్ఞాపకం
చిన్నప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం (అప్పటి ఫిరోజ్ షా కోట్లా)లో ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కడం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని సంజూ చెప్పారు.
తన తండ్రి పోలీస్ విధుల్లో ఉండటంతో ప్రత్యేక అనుమతి తీసుకుని తాను, తన సోదరుడు కలిసి గంటసేపు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశామని తెలిపారు.
ప్రస్తుతం అలాంటి అవకాశం దొరకడం చాలా అరుదని, అది తనకు ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానన్నారు.



