స్నేహితులతో విహారానికి వెళ్లిన సిద్ధిపేట యువకుడికి విషాదం
సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో చికిత్సకు తరలిస్తుండగా కన్నుమూత
ములుగు: ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురం గ్రామం వద్ద ఉన్న మసలోడ్డి (మషెనులోడ్డి) జలపాతం వద్ద జరిగిన విషాద ఘటనలో B.Tech Student ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు సిద్ధిపేట జిల్లాకు చెందిన యాద వైభవ్ కుమార్ (18). బుధవారం అతను తన ఆరుగురు స్నేహితులతో కలిసి మసలోడ్డి జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లాడు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల సమాచారం ప్రకారం.. జలపాతం వైపు దిగుతున్న సమయంలో వైభవ్ కుమార్ కాలు జారి నీటిలో పడిపోయాడు.
అక్కడే ఉన్న కొంతమంది యువకులు వెంటనే అతడిని నీటి నుంచి బయటకు తీసి మోటార్‌సైకిల్‌పై వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ అత్యవసరంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.
అయినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఎటూరునాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా వైభవ్ కుమార్ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



