కొత్తగూడెంలో కవిత ఘాటు విమర్శలు
టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఖాతాల్లో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు అదే నిజమైన న్యాయం అవుతుందని అన్నారు.
బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదని స్పష్టం
తనపై జరుగుతున్న ప్రచారాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తాను తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మా పార్టీతో తమకు భయం లేదని చెబుతూనే, ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలపై ఆరోపణలు
తన ప్రజా పోరాటాలు ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీ కలిసి వ్యవహరిస్తున్నాయని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అనే భావన మిగల్లేదా అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో విలువలు పూర్తిగా కనుమరుగయ్యాయని విమర్శించారు.
సోషల్ మీడియా వ్యాఖ్యలపై హెచ్చరిక
బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికల్లో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లెలు అనే సభ్యత కూడా మరిచి ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు.
సభ్యత దాటి వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. “ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌పై క్విడ్ ప్రొ కో ఆరోపణలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తన మిత్రుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు క్విడ్ ప్రొ కో విధానంలో అక్రమ పర్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
హరీశ్ రావు, కాళేశ్వరం అంశంపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్ రావు ప్రధాన పాత్ర పోషించారని కవిత ఆరోపించారు. అలాంటి నేతనే ఇప్పటికీ బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు.
దీంతో ఆ పార్టీ భవిష్యత్తు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
చేసిన అవినీతి చాలదన్నట్లు, పెద్దాయనకు అంటించిన అవినీతి మరకలు సరిపోనట్లు ఇప్పుడు మూడు నెలలు మంత్రి పదవి కావాలంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం నీళ్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవిత
ప్రస్తుత ముఖ్యమంత్రికి సాగునీటి సమస్యలపై చిత్తశుద్ధి లేదని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్‌పై ఉన్న రాజకీయ కోపంతో కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోసే పనులు నిలిపివేశారని అన్నారు.
అర కిలోమీటర్ మేర రాళ్ల కట్ట నిర్మిస్తే మొత్తం నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పారు. అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
సింగరేణి గనులపై డిమాండ్
తాడిచర్ల-2 మైనింగ్ కేటాయింపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సరైంది కాదని కవిత అన్నారు.
నిజాం కాలంలో రాసిచ్చిన 17 గనుల్లో ఇంకా మిగిలిన 16 గనులను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



