సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
గతంలో సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.
విధానపరమైన నిర్ణయాలపై ఎఫ్ఐఆర్ చెల్లదన్న కోర్టు
2021లో సీఐడీ నమోదు చేసిన ఈ కేసును ఏపీ హైకోర్టు విచారించింది. కేవలం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా జీవోలు జారీ చేయడాన్ని క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో జూలై 15న కేసును కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తప్పులు ఏమీ లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే ఈ తీర్పు కేవలం అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికే పరిమితమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇతర సంబంధిత కేసులకు ఈ తీర్పు వర్తించదని తెలిపింది. ఆయా కేసులను వాటి సొంత మెరిట్స్ ఆధారంగా విచారించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ వేదికలుగా కోర్టులను మార్చవద్దని సీజేఐ సూచన
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రాజకీయ నేతల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతుల హక్కులు, వారి ప్రయోజనాల పరిరక్షణ విషయంలో న్యాయస్థానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు.
అయితే రాజకీయ నాయకులు తమ అంతర్గత రాజకీయ పోరాటాలను, పార్టీల మధ్య విభేదాలను కోర్టుల వేదికగా తీసుకురావడం సరికాదని సీజేఐ సూచించారు.
రాజకీయ విభేదాలను న్యాయపరమైన వివాదాలుగా మార్చే ధోరణిని మానుకోవాలని స్పష్టం చేశారు.



