నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నJr NTR
బగీరా జ్ఞాపకంగా మొక్క నాటిన ఎన్టీఆర్.. అభిమానుల భావోద్వేగ కామెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ పెంపుడు కుక్క బగీరా మరణించింది. దీంతో ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బగీరాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
బగీరా తన ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చిందని, నెమ్మదిగా తన కుటుంబంలో ఒకరిగా మారిపోయిందని ఎన్టీఆర్ తెలిపారు.
ప్రేమ, విశ్వాసం, అల్లరి, ప్రత్యేకమైన ఓదార్పుతో తన రోజులను బగీరా నింపిందని చెప్పారు.
“నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు”
బగీరా లేని లోటుతో ఏర్పడిన నిశ్శబ్దం ఎంత పెద్దదో, అది మిగిల్చిన ప్రేమ కూడా అంతే గొప్పదని ఎన్టీఆర్ అన్నారు.
తనను ఎంచుకున్నందుకు, తన పక్కన నడిచినందుకు, ఈ నాలుగేళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దినందుకు బగీరాకు ధన్యవాదాలు తెలిపారు.
“స్వేచ్ఛగా పరుగెత్తు, నా చిన్నారి. నిన్ను ఎంతో ప్రేమించాను, ఇకముందూ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ఫొటోలు వైరల్

తన పెంపుడు కుక్క బగీరాతో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ షేర్ చేశారు.
బగీరా మరణించిన తర్వాత దానిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో ఒక మొక్క నాటిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ బగీరా మరణంతో బాధలో ఉన్నారని తెలుసుకున్న అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.
త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.



