ఎమ్మెల్యేలకు భారీ బొనాంజా
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు అందించనున్నట్లు వెల్లడించారు.
వాహనంతో పాటు డ్రైవర్, ఇంధనం, కారు నిర్వహణ ఖర్చుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.75వేలు భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేల కోసం సెక్రటరీలను కూడా నియమించనున్నారు. ఇందుకోసం అదనంగా రూ.25వేలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి వాహనాలు
నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఈ వాహనాలను ఉపయోగించుకోవచ్చని సీఎం విజయ్ చెప్పారు.
ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు.
పారదర్శక, అవినీతి రహిత పాలనకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
సీఎం ప్రకటనను ఎమ్మెల్యేలు స్వాగతించారు. ఓ మహిళా ఎమ్మెల్యే విజయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ అసెంబ్లీలో పాట పాడటం ఆసక్తికరంగా మారింది.
ఆరోగ్య బీమా కవరేజీ రూ.25 లక్షలకు పెంపు
ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక ఆరోగ్య బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
ఆదాయం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
పాల ఉత్పత్తిదారులకు కూడా గుడ్‌న్యూస్
ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్ సేకరించే పాల ధరను పెంచుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
ప్రస్తుతం లీటరుకు రూ.38గా ఉన్న ధరను రూ.41కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3.16 లక్షలకుపైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.



