రాళ్లు, కర్రలతో దాడి.. పోలీస్ స్టేషన్లో నిందితుల లొంగుబాటు
ఐదో రోజు కార్యక్రమంలో మొదలైన గొడవ
మహబూబాబాద్ : Mahabubabad జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో రమేష్ అనే వ్యక్తిని తోటి కులస్తులు కొట్టి చంపారు.
కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
మడిపల్లి గ్రామానికి చెందిన రమేష్ ఫ్యామిలీతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. ఇటీవల అదే కులానికి చెందిన వెంకన్న మృతి చెందారు.
మృతుడు ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో కులస్తులంతా కలిసి స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద ఐదో రోజు శాంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కులపెద్దతో ఘర్షణ
శాంతి కార్యక్రమంలో అందరూ ఒకే చోట కూర్చొని మద్యం సేవిస్తూ దావత్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో వారి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది.
అక్కడే ఉన్న రమేష్ తన కులపెద్ద యాకయ్యతో ఘర్షణకు దిగాడు.
దీంతో ఆగ్రహానికి గురైన తోటి కులస్తులు ఒక్కసారిగా రమేష్‌పై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు రమేష్ పరుగులు తీసినా.. అతడిని వెంటాడి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.
తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీస్ స్టేషన్లో నిందితుల లొంగుబాటు
హత్య తర్వాత ఈ ఘటనకు పాల్పడిన నిందితులంతా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఘటనపై Mahabubabad పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.



