పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నారన్న ఆరోపణలు
అమెరికాలో సోషల్ మీడియా బానిసత్వంపై Meta కు వ్యతిరేకంగా భారీ చట్టపరమైన పోరాటం మొదలైంది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో టీనేజర్లు, చిన్నపిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నారంటూ మెటాపై అమెరికాలోని 29 రాష్ట్రాలు ఉమ్మడిగా ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి.
గతంలో పొగాకు పరిశ్రమపై జరిగిన చట్టపరమైన పోరాటంతో పోలుస్తూ.. సోషల్ మీడియా దిగ్గజాలకు కూడా ఇప్పుడు కష్టకాలం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాన్ని అమెరికాలో రెండో ‘బిగ్ టొబాకో’ మూమెంట్‌గా వారు అభివర్ణిస్తున్నారు.
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం
యూజర్లు వీలైనంత ఎక్కువ సమయం యాప్‌లలో గడిపేలా మెటా తన ప్లాట్‌ఫామ్‌లను డిజైన్ చేసిందని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనెయిల్ ఆరోపించారు.
తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటాను సేకరించి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయడం అమెరికా చట్టాలకు వ్యతిరేకమని ఆమె చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌ను మెటా సొంత ఉద్యోగులే ఒక మాదకద్రవ్యంతో పోల్చిన చాట్లను కూడా కోర్టులో ఆధారాలుగా చూపించారు.
పిల్లలు ఎంత చిన్న వయసులో యాప్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తే.. అంత ఎక్కువ ఆదాయం వస్తుందని మెటా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పిటిషన్లో పేర్కొన్నారు.
మార్క్ జుకర్‌బర్గ్ కోర్టుకు?
ఈ కేసులో విచారణ ఆరు వారాల పాటు కొనసాగనుంది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
మెటా ఈ కేసులో ఓడిపోతే 200 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.19 లక్షల కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చని సమాచారం.
అయితే ఈ ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. కేవలం పరిహారం వసూలు చేయడానికే అటార్నీ జనరళ్లు ఈ దావా వేశారని కంపెనీ ఆరోపించింది. పిల్లల భద్రతకు తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తామని మెటా స్పష్టం చేసింది.



