4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. జడ్జి రవికుమార్ వద్ద నుంచి 100కు పైగా హత్య కేసులు బదిలీ

August 20, 2026 12:35 PM
Judge Ravikumar Diwakar at Muzaffarnagar court

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులు మరో కోర్టుకు బదిలీ అయ్యాయి.

జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు ఈ కేసులను బదిలీ చేశారు.

నాలుగు నెలల్లో 22 మందికి మరణశిక్ష

జడ్జి రవికుమార్ దివాకర్ కేవలం నాలుగు నెలల వ్యవధిలో 10 వేర్వేరు కేసుల్లో 22 మంది నిందితులకు ఉరిశిక్ష విధించారు.

ఆయన వరుసగా కఠిన శిక్షలు విధించడంతోనే ఈ కేసులను మరో కోర్టుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

గత ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఆయన పలు పాత కేసుల్లో తీర్పులు ఇచ్చారు. కొన్ని కేసులను ‘అరుదైన వాటిలో అరుదైనది’ (Rarest of rare cases)గా పేర్కొంటూ మరణశిక్ష విధించారు.

న్యాయవాదుల్లో ఆందోళన

మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు జడ్జి రవికుమార్ దివాకర్ వద్దకు వస్తే ఉరిశిక్ష విధించే అవకాశం ఉందన్న భయాందోళనలు న్యాయవాదులు, వాది-ప్రతివాదుల్లో వ్యక్తమయ్యాయని జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రమోద్ త్యాగి తెలిపారు.

ఈ ఆందోళనల నేపథ్యంలోనే 100కు పైగా హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

రవికుమార్ విధించిన మరణశిక్షలు
  • ఆగస్టు 13: 12 ఏళ్ల నాటి హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించారు.
  • ఆగస్టు 12: 27 ఏళ్ల క్రితం (1999) కిడ్నాప్ చేసి వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష విధించారు.
  • జూలై 17 & 06: 2011 నాటి రైతు హత్య కేసులో నలుగురికి, 2010 నాటి మాజీ సర్పంచ్ హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష విధించారు.
  • మే – ఏప్రిల్: 15 ఏళ్ల నాటి తల్లి, కుమారుడి జంట హత్యల కేసులో ఒకరికి, 2019 నాటి న్యాయవాది కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించారు.
గ్యాన్‌వాపి వీడియో సర్వేకు ఆదేశాలు

జడ్జి రవికుమార్ దివాకర్ గతంలో వారణాసిలోని గ్యాన్‌వాపి కాంప్లెక్స్‌లో వీడియో సర్వేకు ఆదేశాలు జారీ చేసి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.

2009లో జడ్జిగా తన కెరీర్ ప్రారంభించిన రవికుమార్ దివాకర్.. 2025 నవంబర్ నుంచి ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media