అసలేం జరిగింది?
లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో సైనిక సిబ్బందితో ఓ మహిళా పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మినామార్గ్ చెక్‌పాయింట్ వద్ద పౌర వాహనాలను గంటల తరబడి నిలిపివేయడంతో ఆమె భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు.
“మేము జెన్-జీ తరం వాళ్లం, ఇలాంటి ధోరణులను సహించం” అంటూ ఆమె అధికారులను నిలదీశారు. వాహనాల్లో కుటుంబాలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ఓ వీఐపీ కాన్వాయ్ కోసం రహదారిని మూసివేశారని ఆరోపించారు.
కాసేపటికి భద్రతా దళాల కాన్వాయ్ అక్కడికి రావడంతో వాహనదారులు పక్కకు జరగాలని సిబ్బంది కోరారు.
ఈ క్రమంలోనే మహిళా పర్యాటకురాలు, భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపించింది.
సైన్యానికి వీకే సింగ్ మద్దతు
ఈ వీడియోపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ స్పందించారు. విధుల్లో ఉన్న సైనికుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు.
సైనిక దళాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
‘ఎక్స్’ వేదికగా వీకే సింగ్ స్పందిస్తూ, దేశ రక్షణలో భారత సైన్యం అజేయమైన గోడలా నిలుస్తుందని చెప్పారు.
మినామార్గ్లో జరిగిన ఘటన సైనికుల ధైర్యం, త్యాగం, నిరంతర అప్రమత్తతను మరోసారి గుర్తుచేస్తోందన్నారు.
పరిస్థితులు ఏవైనా సరే సైనికులను అకారణంగా నిందించడం లేదా అగౌరవపరచడం సమర్థనీయం కాదని వీకే సింగ్ పేర్కొన్నారు.
విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, కేవలం భావోద్వేగాలు లేదా నిరాధార ఆరోపణలతో చేయకూడదని సూచించారు.
దేశం కోసం అహర్నిశలు పనిచేసే సైనికులకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఒమర్ అబ్దుల్లా ఏమన్నారు?
ఈ వీడియోపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు.
“మేము జెన్-జీ” అనే పదాన్ని బెదిరింపులకు లేదా ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడానికి ఉపయోగించకూడదని ఆయన అన్నారు.
జోజిల్లా-మినామార్గ్ మార్గంలో భద్రతా కారణాలు లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ట్రాఫిక్‌ను నియంత్రించడం సాధారణమేనని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.



