ఆస్తులపై వీలునామా రాసి నదిలోకి దూకిన కుటుంబం.. పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు
వేధింపులు ఆపాలని ఇంటికెళ్లి వేడుకున్న నూకరాజు
కాకినాడకు చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
కేసులోని ప్రతి అంశాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ వ్యవహారానికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
తన కుటుంబాన్ని వేధించడం ఆపాలని కోరుతూ నూకరాజు రెండు నెలల క్రితమే సాధిక్ ఖాన్ ఇంటికి వెళ్లి వేడుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం.
అయినప్పటికీ సాధిక్ ఖాన్ తన వ్యవహారాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. ఆ తర్వాత వేధింపులు మరింత పెరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
సాధిక్‌కు అతని సొంత తల్లి కూడా హితవు చెప్పినా అతను పట్టించుకోలేదని తెలుస్తోంది.
గోదావరిలోకి దూకిన కుటుంబం
సాధిక్ ఖాన్ వేధింపులు తట్టుకోలేక ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ గత ఆదివారం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో కార్తికేయ ప్రాణాలతో బయటపడ్డాడు. నూకరాజు, సౌజన్య మృతదేహాలు లభించాయి. నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.
మరోవైపు పరారీలో ఉన్న సాధిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గత రెండు నెలల్లో సాధిక్ ఫోన్ లిస్టులో ఉన్న పలువురికి పోలీసులు ఫోన్లు చేసి అతని ఆచూకీ గురించి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
సాధిక్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నదిలోకి దూకే ముందు వీలునామా
కుటుంబం గోదావరిలోకి దూకే ముందు నూకరాజు కీలక చర్యలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆదివారం రాత్రి నదిలోకి దూకే ముందు మరణ వాంగ్మూలంతో పాటు వీలునామా రాసి పెట్టినట్లు సమాచారం.
సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో వివరించినట్లు తెలుస్తోంది.
అలాగే తన స్థిర, చరాస్తులను ఎవరెవరికి ఇవ్వాలనే విషయాన్ని వీలునామాలో రాసినట్లు సమాచారం.
ఆస్తులను ముగ్గురి పేర్లపై రాసినట్లు తెలుస్తోంది. అందులో నూకరాజు సోదరి మరో ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం.
తమతో పాటు మనవడు కార్తికేయ కూడా నదిలో దూకి చనిపోతాడని భావించిన నూకరాజు.. అతని పేరున ఆస్తులు రాయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
‘ఆంటీ’ కోసం పోలీసుల ఆరా
గోదావరిలోకి దూకే ముందు సౌజన్య తన కుమారుడు కార్తికేయతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
నీకు ఈత వచ్చు కాబట్టి బతికి బయటపడితే ఫలానా ఆంటీ దగ్గరకు వెళ్లి పోలీసులకు తమ కుటుంబం చెప్పిన విషయాలు తెలియజేయాలని సౌజన్య చెప్పినట్లు కార్తికేయ పోలీసులకు వివరించినట్లు సమాచారం.
దీంతో సౌజన్య చెప్పిన ఆ ఆంటీ ఎవరు? ఆమెకు ఈ కేసుకు సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు.
అయితే ఆమె ఫోన్ మూడు రోజులుగా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో సాధిక్ ఖాన్ స్నేహితుడిగా చెబుతున్న మరో వ్యక్తి ఫోన్ కూడా పనిచేయడం లేదని సమాచారం.
ఘటన తర్వాత భయంతో వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.
వారు అందుబాటులోకి వస్తే కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.



