ప్రియురాలి పుట్టినరోజుకు అరుదైన ఒంటెమరి.. దొంగిలించి ఇచ్చిన యువకుడు, చివరకు జైలుపాలు

August 24, 2026 1:16 PM

ప్రియురాలి కోరిక తీర్చేందుకు దొంగతనం

ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామిని సంతోషపెట్టేందుకు రకరకాల కానుకలు ఇస్తుంటారు.

కానీ దుబాయ్‌లో ఓ యువకుడు తన ప్రియురాలి పుట్టినరోజును ప్రత్యేకంగా జరపాలన్న ప్రయత్నంలో ఏకంగా జైలుపాలయ్యాడు.

ప్రియురాలికి ఒంటెలంటే ఎంతో ఇష్టం. పుట్టినరోజుకు అరుదైన ఒంటెను కానుకగా ఇవ్వాలని ఆమె కోరింది.

అయితే ఆ జాతి ఒంటెను కొనుగోలు చేసేంత డబ్బు యువకుడి వద్ద లేదు.

ఎలాగైనా ఆమె కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.

తన నివాసానికి సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో కొత్తగా పుట్టిన అరుదైన ఒంటెమరి ఉన్న విషయాన్ని గుర్తించాడు.

రాత్రివేళ ఒంటెమరి చోరీ

రాత్రి సమయంలో ఫామ్‌హౌస్‌ రక్షణ వలయాన్ని దాటి లోపలికి వెళ్లిన యువకుడు పసి ఒంటెమరిని దొంగిలించాడు.

అనంతరం దాన్ని తన ప్రియురాలికి పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు.

ఫామ్‌హౌస్‌ నుంచి ఒంటెమరి కనిపించకుండా పోవడంతో యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రారంభంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు.

పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

కొన్ని రోజుల తర్వాత ఒంటెమరిని దొంగిలించిన యువకుడే పోలీసులకు ఫోన్ చేశాడు.

తన ఫామ్‌హౌస్‌ సమీపంలో ఓ తప్పిపోయిన పసి ఒంటె కనిపించిందని చెప్పి నాటకం ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే పోలీసులకు అతడి కథపై అనుమానం వచ్చింది. ఒంటెమరి కనిపించిన ప్రాంతం దాని అసలు స్థానం నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అంత చిన్న ఒంటెమరి రోడ్డు దాటి అంత దూరం ఒంటరిగా నడిచి వచ్చే అవకాశం లేదని పోలీసులు గుర్తించారు.

యువకుడిని తీవ్రంగా విచారించడంతో చివరకు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు.

పట్టుబడతామనే భయంతోనే ఒంటెమరి తప్పిపోయిందని నాటకం ఆడినట్లు అంగీకరించాడు.

ప్రేమికులిద్దరూ అరెస్ట్

విషయం బయటపడిన తర్వాత పోలీసులు ఒంటెమరిని భద్రంగా స్వాధీనం చేసుకుని నిజమైన యజమానికి అప్పగించారు.

దొంగతనానికి పాల్పడిన యువకుడితో పాటు, ఒంటెమరిని దొంగిలించినదని తెలిసినా తన వద్ద ఉంచుకున్న ప్రియురాలిపై కూడా కేసులు నమోదు చేశారు.

అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

ప్రియమైన వ్యక్తిని సంతోషపెట్టాలన్న కోరిక ఉన్నా చట్టవ్యతిరేక మార్గాన్ని ఎంచుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి చూపించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media