భయం ఉన్నా నిర్ణయం ఎలా తీసుకోవాలి?
యువతతో ఉత్సాహంగా సమావేశం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో శనివారం 2,000 మందికి పైగా జెన్-జీ యువత గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తమ జీవితాల్లో ఎదురవుతున్న ఎన్నో సమస్యలను యువత ఆయనతో పంచుకున్నారు.
యువతరం ప్రేమగా ‘కూల్ గురు’ అని పిలిచే గురుదేవ్ వారి ప్రశ్నలకు సూటిగా, చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు.
అదే సమయంలో లోతైన ఆలోచనలను రేకెత్తించారు. ఆయన సమాధానాలు యువతలో చిరునవ్వులు పూయించడంతోపాటు స్ఫూర్తిని నింపాయి.
సాధారణ ఆధ్యాత్మిక సమావేశాలకు భిన్నంగా ఈ కార్యక్రమం పాటలు, కేరింతలు, నవ్వులు, సంగీతంతో ఉత్సాహంగా సాగింది. డబ్బు సంపాదించడం, మానవ సంబంధాలు, ఆశయాలు, కెరీర్, జీవితంలో ఎదగడం వంటి అంశాలపై యువత ప్రశ్నలు అడిగారు.
భయం ఉన్నా నిర్ణయం ఎలా తీసుకోవాలి?
భయం ఉన్నప్పటికీ స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకోవాలనే ప్రశ్నకు గురుదేవ్ స్పందించారు.
నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అదే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మన తర్కం మన జ్ఞానంపై ఆధారపడి ఉంటుందని, అయితే మన జ్ఞానానికి ఎప్పుడూ పరిమితులు ఉంటాయని వివరించారు.
జ్ఞానం పెరిగే కొద్దీ మన దృక్కోణం కూడా మారుతుందన్నారు. తెలిసిన విషయాలపై దృఢంగా నిలబడుతూనే కొత్త విషయాలను తెలుసుకునేందుకు మనసును తెరిచి ఉంచడమే సమతుల్యత అని చెప్పారు.
ఆశయాల కోసం పరుగులో ప్రశాంతత ఎలా?
ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ తరానికి అంతర్గత ప్రశాంతతను కోల్పోకుండా ఆశయాలను ఎలా కొనసాగించాలనే ప్రశ్న ఎదురైంది.
దీనికి ధ్యానం ద్వారా అంతర్గత ప్రశాంతతను కాపాడుకుంటూ ముందుకు సాగవచ్చని గురుదేవ్ చెప్పారు.
తల్లిదండ్రులతో అభిప్రాయాలు ఎలా పంచుకోవాలి?
తమ ఆలోచనలను తల్లిదండ్రులు అర్థం చేసుకోనప్పుడు ఏం చేయాలనే ప్రశ్నకు కూడా గురుదేవ్ ఆసక్తికరంగా స్పందించారు.
పూర్తిగా తమ మాటే నెగ్గాలనే పంతం వద్దని, అవసరమైన చోట పట్టు విడుపులు ఉండాలని సూచించారు.
“కొన్నిసార్లు వాళ్ల మాట నెగ్గనీయండి, కొన్నిసార్లు మీది కూడా,” అని ఆయన అన్నారు. “అదే మీ బలం” అని చమత్కరించారు.
ఆధ్యాత్మికత.. విజయానికి అడ్డంకి కాదా?
డబ్బు, విలాసవంతమైన జీవితం, విజయవంతమైన కెరీర్ కోరుకుంటూనే ఆధ్యాత్మికంగా ఉండటం సాధ్యమేనా అనే ప్రశ్నకు గురుదేవ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
ఆధ్యాత్మికతకు, విజయానికి మధ్య ఎలాంటి విరోధం లేదన్నారు.
ఆధ్యాత్మికత మనలో స్థయిర్యం, అంతర్ దృష్టి, వైఫల్యాల నుంచి తిరిగి కోలుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు.
ఇవి వృత్తిపరమైన విజయాన్ని మరింత బలోపేతం చేస్తాయని వివరించారు.
ఆశయాలకు నైతిక మార్గదర్శకత్వం, సరైన దిశను కూడా ఆధ్యాత్మికత అందిస్తుందని అన్నారు.
“మిమ్మల్ని ఎవరైనా మోసం చేయాలని మీరు కోరుకోరు కదా? అలాంటప్పుడు మీరు కూడా ఇతరులను ఎందుకు మోసం చేయాలి?” అని గురుదేవ్ ప్రశ్నించారు.
ఇష్టమైన ఉద్యోగమా.. ఎక్కువ జీతమా?
తమకు ఇష్టమైన రంగంలో కొనసాగాలా? లేక ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకోవాలా? అనే ప్రశ్నకు గురుదేవ్ ఆచరణాత్మకంగా సమాధానం ఇచ్చారు.
“మీ అభిరుచిని మీ నుంచి ఎవరూ లాగేసుకోలేరు. కానీ ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం లభించడం కూడా కష్టమే.
కాబట్టి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకొని.. మీ అభిరుచిని కూడా కొనసాగిస్తూ.. మీరు చేయాలని అనుకున్నది చేయండి’’ అని సూచించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్పై ఆరోపణలను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 2016లో నిర్వహించిన ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ సందర్భంగా యమునా నది వరద మైదానాల పర్యావరణానికి నష్టం వాటిల్లిందనే ఆరోపణలపై గత పదేళ్లుగా విచారణ జరిగింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థపై చేసిన ఆరోపణలను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పును, దానికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను పూర్తిగా నిలిపేసింది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన కార్యక్రమం వల్ల యమునా నది వరద మైదానాలకు ఎలాంటి నష్టం జరగలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కార్యక్రమం కోసం డిపాజిట్‌గా చెల్లించిన రూ. 5 కోట్లను పూర్తిగా తిరిగి పొందేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు హక్కు ఉందని స్పష్టం చేసింది.
ఆ మొత్తాన్ని అపరాధ రుసుముగా చూపడాన్ని కూడా న్యాయస్థానం తప్పుబట్టింది.
35 లక్షల మందికి పైగా పాల్గొన్న వరల్డ్ కల్చర్ ఫెస్టివల్
2016లో యమునా నది తీరంలో జరిగిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 155 దేశాలకు చెందిన 35 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సి. లహోటి అధ్యక్షత వహించారు.



