యాబా డ్రగ్ కోసం డాబాపైకి వెళ్లి.. రిటైర్డ్ టీచర్ కుటుంబంపై దాడి
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
రిటైర్డ్ టీచర్ కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసిన కేసులో ఆయన మేనమామ కొడుకులు సిద్ధార్థ దాస్ (19), ముగ్ధ దాస్ (24)ను అరెస్ట్ చేసినట్లు రంగ్‌పూర్ పోలీస్ కమిషనర్ మొహమ్మద్ అబ్దుల్ తెలిపారు.
యాబా సేవించేందుకు డాబాపైకి..
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రంగ్‌పూర్‌లోని చక్రవర్తి కుటుంబానికి చెందిన రెండంతస్తుల ఇంటి డాబాపైకి ముగ్ధ, సిద్ధార్థ్ వెళ్లారు.
అక్కడ యాబా డ్రగ్ సేవించేందుకు ప్రయత్నించారు.
పై నుంచి శబ్దాలు వినిపించడంతో గణపతి చక్రవర్తి డాబాపైకి వెళ్లారు.
ఆ సమయంలో గణపతి చక్రవర్తి మెడలో ఉన్న టవల్తోనే ఆయనను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అలికిడికి ఏం జరుగుతోందో చూసేందుకు అక్కడికి వచ్చిన ఆయన భార్య ప్రీతిలతను కూడా గొంతు నులిమి చంపేశారు.
కుమార్తె, కుమారుడిపైనా దాడి
తల్లిదండ్రుల వద్దకు వచ్చిన వారి కుమార్తె అగామిపైనా నిందితులు దాడి చేశారు. ఆమెతో పెనుగులాడిన తర్వాత తాడును గొంతుకు బిగించారు.
తమను గుర్తుపడతాడనే భయంతో వారి కుమారుడు ప్రియంను కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి, కుమార్తె అగామి, కుమారుడు ప్రియం మృతదేహాలు శనివారం వారి ఇంట్లోనే లభ్యమయ్యాయి. నిందితులు మృతుల ముఖాలను మండే పదార్థంతో కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్యల తర్వాత ఇంట్లోనే బస
హత్యల తర్వాత ఇద్దరు నిందితులు రాత్రంతా అదే ఇంట్లో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
శుక్రవారం జుమ్మా ప్రార్థనల సమయంలో వీధులు నిర్మానుష్యంగా ఉన్న సమయాన్ని చూసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లారని చెప్పారు.
ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు స్నానం కూడా చేశారు. ఫ్రిజ్‌లో ఉన్న ఖర్జూరాలు, కీరా ముక్కలు తిన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం
కేసును తప్పుదారి పట్టించేందుకు నిందితులు ఇంట్లోని బీరువాలు తెరిచి బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. ఇంట్లోని బంగారు నగలను దోచుకున్నారు.
రెండు మొబైల్ ఫోన్లను సబ్బు నీటిలో ముంచి ధ్వంసం చేశారు.
నిందితుల్లో ఒకడు స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. దీంతో నిప్పుతో ఒక బంగారు గాజును పరీక్షించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
నేరాన్ని అంగీకరించిన నిందితులు
సిద్ధార్థ చేపల వ్యాపారం చేస్తుండగా, ముగ్ధ గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్నాడు.
పోలీసుల విచారణలో సిద్ధార్థ, ముగ్ధ తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
కేసుకు సంబంధించిన మరింత విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.



