ఫ్రిజ్ తెరిచి పాలు తీశాడు.. టీ పెట్టుకుని గిన్నెలు కూడా కడిగాడు!
పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా ధూరి పట్టణంలో వింతైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా దొంగతనానికి పాల్పడేవారు హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు.
కానీ ఈ దొంగ మాత్రం చాలా ప్రశాంతంగా వ్యవహరించాడు.
రెండు గంటల వ్యవధిలో నాలుగు షాపుల్లో చోరీ చేసిన అతడు.. మధ్యలో టీ కూడా కాచుకుని తాగాడు.
అంతేకాదు.. టీ కోసం ఉపయోగించిన గిన్నెలను శుభ్రంగా కడిగి యథాస్థానంలో పెట్టి వెళ్లాడు.
పైకప్పుల గుండా షాపుల్లోకి ప్రవేశం
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. పక్కపక్కనే ఉన్న షాపుల పైకప్పుల మీదుగా వచ్చిన దొంగ.. పైభాగంలోని గేటును పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు.
మొదట స్వరణ్‌జిత్ సింగ్‌కు చెందిన షాపులో చోరీ చేశాడు. అక్కడి నుంచి దాదాపు రూ. 27,000 నగదుతో పాటు వ్యవసాయ పరికరాలను తీసుకెళ్లాడు.
ఆ తర్వాత సిమ్రన్‌జిత్ సింగ్‌కు చెందిన షాపులోకి వెళ్లాడు.
అక్కడ చోరీ చేస్తుండగా అతడికి టీ తాగాలనిపించింది. దీంతో ఎలాంటి భయం లేకుండా ఫ్రిజ్ తెరిచి పాలు బయటకు తీశాడు.
స్టవ్ వెలిగించి సొంతంగా టీ తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని టీ తాగాడు.
టీ తాగడం పూర్తయ్యాక తాను ఉపయోగించిన పాత్రలను శుభ్రంగా కడిగి మళ్లీ వాటి స్థానంలో పెట్టాడు.
అనంతరం తిరిగి చోరీ కొనసాగించాడు.
ఈ మొత్తం వ్యవహారం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది.
నగదు, మొబైల్ ఫోన్లు, డ్రిల్లింగ్ మెషీన్లు చోరీ
సిమ్రన్‌జిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగ తన షాపులోని కౌంటర్లను పగలగొట్టి సుమారు రూ. 1,500 నగదుతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు.
ఇలా వరుసగా నాలుగు షాపుల్లోకి చొరబడిన దొంగ భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లాడు.
సీసీటీవీ హార్డ్ డిస్క్‌లు కూడా తీసుకెళ్లాడు
తన ఆధారాలు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు రెండు షాపుల్లోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశాడు.
అంతేకాదు.. అన్ని షాపులకు చెందిన సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు.
ఈ ఘటనపై ధూరి ఎస్హెచ్ఓ రమణ్‌దీప్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా గుర్తుతెలియని దొంగను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.



