గేమింగ్ కోసం డబ్బులు కావడంతో చోరీకి ప్లాన్
హైదరాబాద్ : హైదరాబాద్ రీన్‌బజార్‌లో ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను టాస్క్‌ఫోర్స్, రీన్‌బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆగస్టు 22న ఫిర్యాదు
యాకుత్‌పురాకు చెందిన 16, 15 ఏళ్ల ఇద్దరు బాలురు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇద్దరూ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఆగస్టు 22న రీన్‌బజార్ పోలీసులకు ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు.
గేమింగ్ కోసం డబ్బులు.. చోరీకి ప్లాన్
విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. గేమింగ్ జోన్లకు(Online Gaming) వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం, వ్యక్తిగత అవసరాలకు నగదు కొరత ఏర్పడటంతో విలువైన వస్తువులు, నగదు చోరీ చేయాలని ప్లాన్ చేసినట్లు బాలురు వెల్లడించారని పోలీసులు చెప్పారు.
ఇంట్లో ఎవరూ లేరని భావించి..
ఆగస్టు 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరు బాలురు ఓ ఇంటి గేటుకు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. ఇంట్లో ఎవరూ లేరని భావించి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు భారతీయ, విదేశీ కరెన్సీని చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రూ.18 లక్షల సొత్తు స్వాధీనం
నిందితుల నుంచి 124.67 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25 వేల భారతీయ కరెన్సీ, రూ.12 వేల విదేశీ కరెన్సీ, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.



