కేంద్ర కేబినెట్‌లో మార్పులు?
Delhi: త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రివర్గంలో కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ధర్మేంద్ర ప్రదాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మంత్రివర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
తాను వేగంగా పనిచేయలేకపోతున్నానని ఆయన చెప్పడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చన్న చర్చ సాగుతోంది.
మరికొందరు సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలు.. ప్రాంతీయ సమీకరణాలపై ఫోకస్
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
నిబంధనల ప్రకారం మరికొందరికి అవకాశం కల్పించే వెసులుబాటు ఉంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ప్రాంతీయ సమీకరణాలు, కూటమి పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి.
సీనియర్ నేతలకు బదులుగా యువతకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
వయసు పైబడిన నేతలను తప్పించి వేగంగా పనిచేసే వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఎవరు ఇన్? ఎవరు అవుట్? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
రెండు రాష్ట్రాల నుంచి కొత్త వారికి లేదా మిత్రపక్షాలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మిత్రపక్షాలకు అవకాశం ఇస్తే జనసేనకు కూడా కేబినెట్‌లో చోటు దక్కవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
మచిలీపట్నం జనసేన పార్లమెంటు సభ్యుడు బాలశౌరికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ నుంచి మరో ఇద్దరికి అవకాశం దక్కవచ్చన్న చర్చ కూడా ఉంది.
ఇటీవల జాతీయ పార్టీలో అవకాశం దక్కకపోవడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నాయి.
మొత్తంగా యువ నాయకులు, కొత్త ముఖాలకు ఈ పునర్వ్యవస్థీకరణలో అవకాశం లభించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే మంత్రివర్గంలో ఎవరు కొనసాగుతారు, ఎవరికి కొత్తగా అవకాశం దక్కుతుంది అనేది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.



