హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో యూడీఎఫ్ తగ్గింపు
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే దేశీయ విమాన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది.
ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను రూ.750 నుంచి రూ.515కు తగ్గించింది.
అంటే ఒక్కో ప్రయాణికుడిపై రూ.235 తగ్గింపు లభించనుంది.
సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
కొత్త టారిఫ్‌లు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇవి 2031 మార్చి 31 వరకు కొనసాగుతాయి. అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్‌ను కూడా రూ.1,500 నుంచి రూ.1,030కు తగ్గించారు.
ఎయిర్‌పోర్ట్ నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.1,150 కంటే కూడా తక్కువగా ఏఈఆర్‌ఏ ఛార్జీని ఖరారు చేసింది.
భారీ అభివృద్ధి పనుల ఖర్చుపై కొత్త విధానం
విమానాశ్రయంలో చేపట్టే భారీ అభివృద్ధి పనుల ఖర్చును ప్రయాణికులపై ముందుగానే వేయకుండా ఏఈఆర్‌ఏ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
‘ఇన్‌క్రిమెంటల్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్’ విధానం ప్రకారం ప్రాజెక్టులు పూర్తై వినియోగంలోకి వచ్చిన తర్వాతే వాటి ఖర్చును విమానాశ్రయ ఛార్జీల ద్వారా రికవరీ చేస్తారు.
కొత్త టెర్మినల్ భవనాలు, రన్‌వేలు, ట్యాక్సీవేలు వంటి ప్రాజెక్టులు టారిఫ్ కాలం రెండో భాగంలో పూర్తయ్యే అవకాశం ఉంది.
దీంతో అవి అందుబాటులోకి రాకముందే వాటి ఖర్చును ప్రయాణికుల నుంచి వసూలు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు.
ల్యాండింగ్ ఛార్జీల్లోనూ మార్పులు
విమానయాన సంస్థలకు సంబంధించిన కొన్ని ఇతర ఛార్జీలను కూడా ఏఈఆర్‌ఏ తగ్గించింది.
కొత్త టారిఫ్ కాలానికి దేశీయ విమానాల ల్యాండింగ్ ఛార్జీని మెట్రిక్ టన్నుకు రూ.435గా, అంతర్జాతీయ విమానాలకు రూ.630గా నిర్ణయించింది.
హైదరాబాద్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ మొత్తం రూ.27,851 కోట్ల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్‌ను ప్రతిపాదించింది.
అయితే టారిఫ్‌లను నిర్ణయించేందుకు ఏఈఆర్‌ఏ రూ.11,683.49 కోట్లను ప్రాథమిక ARRగా పరిగణించింది.
దీని ఆధారంగా ఒక్కో ప్రయాణికుడిపై సగటు ఆదాయాన్ని రూ.426.39గా నిర్ణయించింది.



