జననాల రేటు పెంచేందుకు కీలక నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుతోంది. దీంతో పలు దేశాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహిస్తూ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నాయి.
పిల్లల పెంపకం, ఆరోగ్యం, చదువు ఖర్చుల్లోనూ ప్రభుత్వాలు కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సింగపూర్లో సంతానోత్పత్తి రేటు 0.87కి పడిపోయింది. ఇది అత్యంత ఆందోళనకర స్థాయిగా మారింది.
జననాల రేటును పెంచేందుకు సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రసూతి సెలవులు వంటి పలు చర్యలు చేపట్టింది.
విశ్వవిద్యాలయ పట్టభద్రుల కోసం మ్యాచ్మేకింగ్ ఈవెంట్లను కూడా నిర్వహించింది.
అయినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదు.
ఒక్కో బిడ్డకు రూ.55 లక్షల వరకు సాయం
జననాల రేటు రికార్డు స్థాయిలో తగ్గుతుండటంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
పిల్లలను కనే దంపతులకు ఒక్కో బిడ్డకు 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు 70,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.55 లక్షలు / 55,000 అమెరికన్ డాలర్లు) వరకు ఆర్థిక సహాయం అందించనుంది.
ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా వివిధ దశల్లో అందిస్తారు. బిడ్డ పుట్టిన వెంటనే బేబీ గిఫ్ట్ కింద తల్లిదండ్రులకు 10,000 సింగపూర్ డాలర్లు అందిస్తారు.
ఆరోగ్యం, సేవింగ్స్, చదువుకు ప్రయోజనాలు
బిడ్డకు 17 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య సంరక్షణ గ్రాంట్లు, సేవింగ్స్ సాయం, వార్షిక చైల్డ్ క్రెడిట్స్తో పాటు చదువుకు సంబంధించిన ఆర్థిక సహాయం అందుతుంది.
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది.
ప్రతి చిన్నారికి సమాన ప్రయోజనం
ప్రస్తుతం సింగపూర్లో అమల్లో ఉన్న కొన్ని కుటుంబ సంక్షేమ పథకాల్లో మొదటి, రెండో, తదుపరి పిల్లల జనన క్రమాన్ని బట్టి ప్రయోజనాలు మారుతున్నాయి.
కొత్త విధానంలో మాత్రం ప్రతి చిన్నారికి ఒకే స్థాయిలో ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకాల ద్వారా 2026 జూన్ నాటికి సుమారు 3.8 లక్షల కుటుంబాల్లోని 6.1 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.



