ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్-95 (I-95)పై జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు.
మంగళవారం (ఆగస్టు 25) ఉదయం 10 గంటలకు కొద్దిసేపటి ముందు పామ్ బే ప్రాంతంలోని 172వ మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.
ఢీకొన్న తీవ్రతకు వాహనంలో మంటలు చెలరేగాయి.
వాహనంలో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
ప్రమాదంపై దర్యాప్తు
ప్రమాదంలో మృతి చెందిన వారి గుర్తింపు వివరాలను అధికారులు తొలుత వెల్లడించలేదు.
ప్రమాదానికి అసలు కారణమేంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే మృతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ (నాడాపూర్)కు చెందిన రాహుల్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హరిబాబు, నాగమణి దంపతుల కుమారుడైన రాహుల్ ఉన్నత చదువుల కోసం కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లు సమాచారం.
రాహుల్ మృతితో కుటుంబంలో విషాదం
అమెరికాలో చదువుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
రాహుల్ మృతితో నారాయణపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా తెలంగాణకు చెందిన వారిగా సమాచారం.
అయితే వారి పూర్తి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాలను స్వదేశానికి తరలించే అంశంపై అధికారులు, కుటుంబ సభ్యులు సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.



