తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 31 నుంచి పౌష్టికాహారం

August 27, 2026 11:29 AM

మంచిర్యాల జిల్లాలో అల్పాహార పథకం ప్రారంభం
  • ఆగస్టు 31 నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం
  • 691 ప్రభుత్వ పాఠశాలల్లోని 42,450 మంది, 13 జూనియర్ కాలేజీల్లోని 6,654 మంది విద్యార్థులకు ప్రయోజనం
  • హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో 4 వేల చదరపు అడుగుల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు
ఆధునిక కిచెన్‌లో భారీగా అల్పాహారం తయారీ

మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనుంది.

మంచిర్యాల జిల్లాలో ఈ పథకాన్ని ఆగస్టు 31న ప్రారంభించనున్నారు.

మంచిర్యాల జిల్లా పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూఫ్‌టాప్ ఆటోమేటెడ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు.

సింగరేణి సీఎస్ఆర్ నిధులు, హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో దీనిని నిర్మించారు.

ఈ కిచెన్ ద్వారా 18 మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, 13 జూనియర్ కాలేజీల్లోని 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.

అలాగే 5 వేల మంది కళాశాల విద్యార్థులకు మద్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేశారు.

గంటకు వేలాది ఇడ్లీలు, దోశలు, పూరీలు

హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని విద్యార్థులకు ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.

కిచెన్‌లో గంటకు 8 వేల ఇడ్లీలు, 3 వేల దోశలు, 5 వేలకు పైగా పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్వాహకులు తెలిపారు.

రెండు గంటల్లో 5 వేల మంది విద్యార్థులకు సరిపడా సాంబారు, కూరలను తయారు చేయగలమని చెప్పారు.

పూర్తిగా శాఖాహార భోజనం అందిస్తామని కిచెన్ ఏజీవిం సందీప్ సింగ్ తెలిపారు. 15 నిమిషాల్లో వెయ్యి మందికి సరిపడా అన్నం సిద్ధం చేసే పరికరాలు ఉన్నాయని వివరించారు.

ప్రత్యేక సదుపాయాలతో సెంట్రలైజ్డ్ కిచెన్

ఈ కిచెన్‌లో వెజిటబుల్ వాషింగ్, కటింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు.

మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్వో వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థులు ఉదయం అర్థాకలితో పాఠశాలకు వెళ్లకుండా, ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుని ఉత్సాహంగా చదువుకోవాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

కిచెన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సెంట్రలైజ్డ్ కిచెన్‌ను పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరూ అర్థాకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రేంసాగర్ రావు అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారంతో కూడిన అల్పాహారం, భోజనం అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఆగస్టు 31 నుంచి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అల్పాహార పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media