మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది.
మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా దీప్తి ఈ ఘనత సాధించింది.
150వ టీ20 మ్యాచ్‌లో రికార్డు
థాయ్‌లాండ్‌తో మ్యాచ్ దీప్తి శర్మకు 150వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. హర్మన్‌ప్రీత్ కౌర్ (203), స్మృతి మంధాన (172) తర్వాత 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రీడాకారిణిగా దీప్తి నిలిచింది.
ఓవరాల్‌గా 150 లేదా అంతకంటే ఎక్కువ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 12వ మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కేవలం 7 బంతులు మాత్రమే వేసింది. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టింది.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది.
- దీప్తి శర్మ (భారత్) – 150 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు
- తిపచ్చ పుత్తవోంగ్ (థాయ్‌లాండ్) – 109 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు
- హెన్రియెట్ ఇషిమ్వే (రువాండ) – 134 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు
- సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్) – 113 మ్యాచ్‌ల్లో 154 వికెట్లు
- కారీ చాన్ (హాంగ్‌కాంగ్) – 115 మ్యాచ్‌ల్లో 153 వికెట్లు
థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
షెఫాలీ వర్మ (64; 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించింది. ప్రతీకా రావల్ (22), స్మృతి మంధాన (19) పరుగులు చేశారు.
థాయ్‌లాండ్ బౌలర్లలో సులీపోర్న్ లావోమి మూడు, సునిదా చతురోంగ్-రత్తన రెండు వికెట్లు తీశారు.
తిప్చా పుట్టావోంగ్, చనిద సుత్తిరుయాంగ్ చెరో వికెట్ పడగొట్టారు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది.
థాయ్‌లాండ్ బ్యాటర్లలో ననపత్ (41; 48 బంతుల్లో 5 ఫోర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచింది.
భారత బౌలర్లలో నందిని, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు తీశారు. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్ ఒక వికెట్ తీసింది.



