బడికి పుస్తకం తేలేదని ఎండలో నిలబెట్టిన టీచర్.. పదేళ్ల చిన్నారి మృతి

September 1, 2026 10:12 AM

పుస్తకం తీసుకురాలేదని కఠిన శిక్ష

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కేవలం క్లాస్ పుస్తకం తీసుకురాలేదనే కారణంతో పదేళ్ల బాలికకు ఉపాధ్యాయురాలు కఠిన శిక్ష విధించారు.

తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలబడటంతో బాలిక ఆరోగ్యం క్షీణించింది.

చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన తూర్పు వినోద్ నగర్‌లోని సర్వోదయ కన్యా విద్యాలయలో చోటుచేసుకుంది. మృతురాలిని పింకీగా గుర్తించారు.

అసలేం జరిగిందంటే..?

ఆగస్టు 27న పాఠశాలకు వెళ్లిన 10 ఏళ్ల పింకీ క్లాస్ పుస్తకం తీసుకురాలేదు.

దీంతో ఉపాధ్యాయురాలు ఆమెను శిక్షగా పాఠశాల మైదానంలో ఎండలో నిలబడాలని ఆదేశించారు.

టీచర్ చెప్పినట్లుగానే బాలిక గంటల తరబడి ఎండలో నిలబడింది.

ఎండ తీవ్రతకు కొంతసేపటికే బాలిక ఆరోగ్యం క్షీణించింది.

అయితే విషయం గుర్తించిన ఉపాధ్యాయులు కొన్ని గంటల తర్వాత ఆమె పరిస్థితిని గమనించారు.

అప్పటికే బాలిక ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

పాప పరిస్థితి చూసి తల్లి షాక్

విద్యార్థిని తల్లి అంజలి కథనం ప్రకారం.. ఆగస్టు 27న మధ్యాహ్నం పాఠశాల యాజమాన్యం నుంచి ఆమెకు అత్యవసర ఫోన్ వచ్చింది.

పాప ఆరోగ్యం బాగోలేదని, వెంటనే పాఠశాలకు రావాలని చెప్పారు.

దీంతో ఆందోళనకు గురైన అంజలి వెంటనే స్కూలుకు చేరుకున్నారు.

అక్కడ తన కుమార్తె తీవ్ర అస్వస్థతతో కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది.

టీచర్‌పై బదిలీ వేటు

చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీచర్ విధించిన కఠిన శిక్ష వల్లే బాలిక పరిస్థితి విషమించిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

విచారణ నిష్పాక్షికంగా జరిగేలా బాధ్యురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలిని తక్షణమే బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

పాఠశాలల్లో విద్యార్థులకు కఠిన శిక్షలు విధించకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media