అమెరికాలో భారత సంతతి వ్యక్తికి షాక్
అమెరికాలో భారత సంతతికి చెందిన 55 ఏళ్ల గుర్‌మీత్ సింగ్‌కు ఫెడరల్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
తీవ్రమైన నేరచరిత్రను దాచిపెట్టి అమెరికా పౌరసత్వం పొందినందుకు అతని సిటిజన్‌షిప్‌ను రద్దు చేస్తూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది.
ప్రస్తుతం లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్‌మీత్ సింగ్ ఇకపై అమెరికా పౌరుడు కాదని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ లైంగిక దాడి
అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ వివరాల ప్రకారం.. భారత్‌కు చెందిన గుర్‌మీత్ సింగ్ 1992 ఫిబ్రవరిలో ఆరు నెలల తాత్కాలిక విజిటర్ వీసాతో అమెరికాకు వెళ్లాడు.
వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయాడు. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్ ద్వారా 2000 జూన్‌లో గ్రీన్ కార్డ్ హోదా పొందాడు.
2011 మేలో న్యూయార్క్‌లో ట్యాక్సీ నడుపుతున్న సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలు అతని క్యాబ్‌లో నిద్రపోయింది.
ఆమెను కత్తితో బెదిరించి, బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పౌరసత్వ దరఖాస్తులో నేరాన్ని దాచాడు
లైంగిక దాడి జరిగిన కొన్ని రోజులకే గుర్‌మీత్ సింగ్ అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే తనపై నమోదైన ఈ తీవ్రమైన నేరాన్ని దరఖాస్తులో వెల్లడించలేదు.
దీంతో అధికారులు 2011 అక్టోబర్‌లో అతనికి అమెరికా పౌరసత్వం మంజూరు చేశారు.
అయితే లైంగిక దాడి కేసు విచారణలో గుర్‌మీత్ సింగ్ దోషిగా తేలాడు. న్యూయార్క్ కోర్టు 2014లో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
15 ఏళ్ల తర్వాత పౌరసత్వం రద్దు
గుర్‌మీత్ సింగ్ అమెరికా పౌరసత్వం పొందే సమయంలోనే తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని, ఆ విషయాన్ని పౌరసత్వ దరఖాస్తులో అబద్ధాలతో దాచాడని జస్టిస్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.
దీనిపై విచారణ జరిపిన న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
మోసంతో పొందిన పౌరసత్వం కాపాడదు
ఈ తీర్పుపై అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే స్పందించారు. మోసపూరితంగా పొందిన అమెరికా పౌరసత్వం నేరస్థులను న్యాయం నుంచి కాపాడదని స్పష్టం చేశారు.
తీవ్రమైన నేరచరిత్ర ఉన్న గుర్‌మీత్ సింగ్ ఇకపై అమెరికా పౌరుడు కాదని తెలిపారు.
అబద్ధాలు చెప్పి, మోసం చేసి పౌరసత్వం పొందే వారికి ఈ తీర్పు బలమైన హెచ్చరిక అని అమెరికా అధికారులు వెల్లడించారు.
చట్టవిరుద్ధంగా పౌరసత్వం పొందిన వారిపై రద్దు చర్యలు కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.



