ఓనం వేడుకల వేళ.. అమెరికాలో ఇద్దరు మలయాళీ మహిళల దారుణ హత్య

September 1, 2026 3:45 PM

రూమ్‌మేట్ అనిలా బేబీ అరెస్ట్.. హత్యలకు కొన్ని రోజుల ముందే కలిసి ఓనం వేడుకలు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్‌లో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.

మృతులను త్రిస్సూర్ జిల్లా ముడిక్కోడ్‌కు చెందిన అంజన హరి (35), తిరువనంతపురం జిల్లా కేసవదాసపురానికి చెందిన అన్ మేరీ మాథ్యూ (40)గా పోలీసులు గుర్తించారు.

ఈ రెండు హత్యలు ఆగస్టు 28న జరిగినట్లు తెలిపారు.

ఒకరిని కారుతో ఢీకొట్టి.. మరొకరిని కత్తితో పొడిచి..

పోలీసుల వివరాల ప్రకారం.. మిల్పిటాస్‌లోని మిల్ క్రీక్ అపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలోని పార్కింగ్ ప్రాంతానికి అంజనను పిలిపించారు.

అనంతరం ఆమెపైకి కారును వేగంగా దూకించి హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఘటన తర్వాత బ్లూ కలర్ ఎస్‌యూవీ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

మరోవైపు అన్ మేరీ మాథ్యూను అపార్ట్‌మెంట్‌లోని గదిలోనే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

రూమ్‌మేట్ అనిలా బేబీ అరెస్ట్

అంజన మృతదేహం పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర గాయాలతో కనిపించడంతో మిల్పిటాస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు పరిసరాల్లో గాలించి బ్లూ ఎస్‌యూవీని గుర్తించారు.

దాని డ్రైవర్‌గా ఉన్న 32 ఏళ్ల అనిలా బేబీని అదుపులోకి తీసుకున్నారు.

అనిలా బేబీ కేరళలోని కొట్టాయం జిల్లా ఈరట్టుపేటకు చెందిన మహిళగా గుర్తించారు.

ఆమె అంజన హరి, అన్ మేరీ మాథ్యూలతో కలిసి ఒకే ఇంట్లో నివసించేదని పోలీసులు తెలిపారు.

ఇద్దరి హత్యల్లోనూ ఆమె ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ.. హత్యలకు ఖచ్చితమైన కారణాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

హత్యలకు కొన్ని రోజుల ముందే ఓనం వేడుకలు

ఈ ఘటనలో మరో విషాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

హత్యలకు కొన్ని రోజుల ముందే అంజన, అన్ మేరీ, అనిలా బేబీ కలిసి ఎంతో సంతోషంగా ఓనం పండుగ జరుపుకున్నారు.

ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కుటుంబ సభ్యులతోనూ పంచుకున్నారు.

కొద్దిరోజుల్లోనే ఇద్దరు మహిళలు హత్యకు గురికావడంతో కేరళలోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మృతదేహాలను కేరళకు తరలించేందుకు ఏర్పాట్లు

అంజన హరి 2021లో యూఎస్‌కు వెళ్లి స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త విజయేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది.

అన్ మేరీ మాథ్యూ కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త జాకబ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ గోపీ విదేశాంగ శాఖ, శాన్ ప్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నారు.

పోస్టుమార్టం పూర్తయ్యాక అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి వారంలోగా మృతదేహాలను కేరళకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, కేంద్ర మంత్రి సురేష్ గోపీ బాధిత కుటుంబాలను పరామర్శించారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media