హిమాలయాల్లో వర్షం.. భారత్‌లో వరద
నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వరదలు కేవలం ఆ దేశానికే పరిమితం కావడం లేదు. దిగువన ఉన్న భారత్‌లోనూ పెను ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తర బెంగాల్ ప్రాంతాలపై ప్రభావం పడుతోంది.
హిమాలయాల్లో పుట్టే నదులను భారత్, నేపాల్ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. దీంతో నేపాల్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ ప్రభావం దిగువన ఉన్న భారత ప్రాంతాలపై పడుతోంది.
నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ దిశగా ప్రవహించి భారత్‌లోని గంగా నది పరివాహక ప్రాంతంలో కలుస్తాయి.
తూర్పున కోసి, మధ్యలో గండక్, పశ్చిమాన కర్నాలి, సరిహద్దుల్లోని మహాకాళి నదులతో పాటు బాగ్మతి, కమల, రాప్తి, బబాయ్ వంటి నదులు నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవహిస్తున్నాయి.
ఎక్కువగా నష్టపోయే రాష్ట్రాలు
భారత్‌లో వరద ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ముందుంది. ఉత్తర బీహార్‌లో దాదాపు 75 శాతం భూభాగం వరద ముప్పు పరిధిలోనే ఉంది.
ముఖ్యంగా బీహార్ దుఃఖదాయినిగా పిలిచే కోసి నదితో పాటు గండక్, బాగ్మతి నదులు భారీ నష్టాన్ని కలిగిస్తాయి.
తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, బహ్రైచ్, లఖింపూర్ ఖేరీ, శ్రావస్తి వంటి జిల్లాలు ఘాఘ్రా, రాప్తి నదుల వల్ల తరచూ ముంపునకు గురవుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో మహాకాళి-శారద నదులు, ఉత్తర బెంగాల్‌లో మేచి, మహానంద నదులు కూడా వరదలకు కారణమవుతున్నాయి.
నీటి ప్రవాహం మాత్రమే కాదు.. అసలు సమస్య ఇదే
నేపాల్‌లో కురిసే వర్షం భారత్‌లో వరద విపత్తుగా మారడానికి మూడు ప్రధాన దశలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎత్తైన హిమాలయాల కంటే శివాలిక్, చూరే, తెరాయ్ వంటి తక్కువ ఎత్తు ప్రాంతాల్లో కురిసే కుండపోత వర్షాలు మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
పర్వతాల నుంచి మైదాన ప్రాంతాలకు ప్రవహించే సమయంలో నదులు భారీగా మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలను తీసుకొస్తాయి. ఈ పదార్థాలు మైదాన ప్రాంతాల్లో నదీ గర్భంలో మేటవేస్తాయి. దీంతో నదుల ప్రవాహ మార్గం మారుతుంది.
అదే సమయంలో గంగా నదిలో నీటి మట్టం, భారత్ వైపు కురిసే వర్షాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లు, రైల్వేలు, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు వరద తీవ్రతను మరింత పెంచుతాయి.
‘‘సరిహద్దు వద్దకు వచ్చే గరిష్ట నీటి ప్రవాహాన్ని నేపాల్ వర్షపాతం నిర్ణయిస్తే.. అది భారత్‌లోకి వచ్చాక ఎంతటి విపత్తుగా మారుతుందనేది భారత్ వైపు ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని ఐసీఐఎంఓడీ శాశ్వత సన్యాల్ తెలిపారు.
2008 కోసి విపత్తు ఏం చెబుతోంది?
2008 నాటి కోసి విపత్తు దీనికి స్పష్టమైన ఉదాహరణగా నిపుణులు చెబుతున్నారు.
ఆ సమయంలో నదిలో నీటి ప్రవాహం సాధారణ సామర్థ్యంలో పదో వంతు మాత్రమే ఉన్నప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడంతో నేపాల్ భూభాగంలోని కట్ట తెగిపోయింది. దీంతో బీహార్‌లో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంటే అది కేవలం నీటి ఉధృతితో వచ్చిన విపత్తు కాదు. నిర్మాణ నిర్వహణలో లోపం కూడా ప్రమాదాన్ని తీవ్రతరం చేసింది.
‘నేపాల్ గేట్లు ఎత్తింది’.. నిజమేనా?
భారత్‌లో వరదలు వచ్చిన ప్రతిసారీ నేపాల్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిందనే ప్రచారం జరుగుతోంది. అయితే శాస్త్రవేత్తలు దీన్ని ఒక పెద్ద అపోహగా కొట్టిపారేస్తున్నారు.
నేపాల్‌లో భారీ నిల్వ జలాశయాలు దాదాపు లేవు. కోసి, గండక్ బ్యారేజీల నిర్వహణ బాధ్యత భారత్ చేతుల్లోనే ఉంది.
వర్షం తీవ్రత పెరిగినప్పుడు నదుల్లోకి చేరిన నీరు సహజంగానే దిగువకు ప్రవహిస్తుంది. నేపాల్ కావాలని భారీగా నీటిని నిల్వ చేసి, తర్వాత ఒక్కసారిగా విడుదల చేసే పరిస్థితి లేదని నిపుణులు వివరిస్తున్నారు.
ముందస్తు హెచ్చరికలు ఉన్నా.. సవాళ్లు ఇవే
సాధారణ రుతుపవన వరదలకు సంబంధించి భారత్‌కు 12 గంటల నుంచి 2 రోజుల వరకు ముందస్తు సమయం లభిస్తుంది.
పర్వత ప్రాంతాల నుంచి బీహార్ మైదానాలకు కోసి, గండక్ నదుల ద్వారా నీరు చేరడానికి దాదాపు ఒక రోజు పడుతుంది.
అయితే క్లౌడ్ బరస్ట్‌లు, విస్ఫోటనాలు లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ మాత్రం కొన్ని గంటల్లోనే దూసుకొచ్చే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య రియల్ టైమ్ డేటా మార్పిడి జరుగుతున్నప్పటికీ, వేగంగా ప్రవహించే నదీ ప్రాంతాల్లో మానిటరింగ్ స్టేషన్ల కొరత, సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడం ఇప్పటికీ ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.
సాధారణ వరదల కంటే హిమాలయ మార్పులే పెద్ద ముప్పు
ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ రాజీవ్ సిన్హా ప్రకారం.. సాధారణ వరదల కంటే హిమాలయాల్లో జరుగుతున్న భౌగోళిక మార్పులే భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
శకలాల ప్రవాహం
ఇది కేవలం నీటితో వచ్చే వరద కాదు. నీరు, మంచు, కొండచరియలు, భారీ రాతి వ్యర్థాలు కలిసి చిక్కని బురద ప్రవాహంగా మారుతాయి. దారిలో ఎదురయ్యే వాటిని తీవ్రంగా ధ్వంసం చేస్తాయి.
2021 ఉత్తరాఖండ్ చమోలి దుర్ఘటన, 2025 ధరాలీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా ఉన్నాయి.
ప్రస్తుత నేపాల్ వరదలు వీటన్నింటి కంటే 5 నుంచి 10 రెట్లు తీవ్రమైనవిగా భావిస్తున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం
గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో క్లౌడ్ బరస్ట్‌లు, గ్లేసియల్ సరస్సులు బద్దలవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.
మరోవైపు నదీ గర్భాల్లో మట్టి మేట వేయడం వల్ల నీటిని మోసుకెళ్లే నదుల సామర్థ్యం తగ్గుతోంది. ఇవన్నీ కలిసి వరద ముప్పును మరింత పెంచుతున్నాయి.
పరిష్కారం ఎలా ఉండాలి?
వరదలకు భారత్, నేపాల్ ఒకరినొకరు నిందించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఎగువన నేపాల్, దిగువన భారత్ ఉన్న ఈ ఉమ్మడి నదీ వ్యవస్థలో రెండు దేశాల మధ్య సమన్వయం అవసరం.
- అధునాతన ఉమ్మడి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
- హిమానీనద సరస్సులను నిరంతరం పర్యవేక్షించాలి.
- కట్టల నిర్వహణ, నదీ గర్భాల్లో పూడికతీతకు సంబంధించి ఉమ్మడి ప్రణాళిక రూపొందించాలి.
- హెచ్చరికలను క్షేత్రస్థాయిలోని సాధారణ ప్రజలకు వేగంగా చేరవేసే పటిష్ట సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.



