దారుణం.. బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది!

September 3, 2026 1:39 PM

రూ.లక్షల్లో బిల్లు.. డబ్బులు లేకపోవడంతో షాకింగ్ నిర్ణయం

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ బార్ సిబ్బంది చేసిన పని తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం, ఆహారం తీసుకున్న తర్వాత బిల్లు చెల్లించలేకపోయిన ఓ మహిళకు బార్ సిబ్బంది గుండు కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బార్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

60 వేల థాయ్ బాట్ల బిల్లు

ఆగస్టు 25న ఓ మహిళ నకిలీ గుర్తింపు కార్డుతో బార్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆమె ఆహారం, మద్యం తీసుకుంది. ఇందుకు దాదాపు 60 వేల థాయ్ బాట్లు, అంటే సుమారు 1,812 డాలర్ల బిల్లు వచ్చింది.

అయితే బిల్లు చెల్లించేందుకు ఆమె వద్ద డబ్బులు లేకపోయాయి. దీంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా బార్ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు.

చేతిలో డబ్బులు లేకపోవడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా అక్కడికక్కడే ఓ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

జుట్టుకు బదులుగా బిల్లు చెల్లింపు?

డబ్బులకు బదులుగా తన జుట్టును విక్రయించే ‘హెయిర్ పర్చేజ్ కాంట్రాక్ట్’కు ఆ మహిళ అంగీకరించినట్లు సమాచారం.

ఆ తర్వాత ఓ బార్‌టెండర్ ఎలక్ట్రిక్ రేజర్‌తో ఆమె భుజాల వరకు ఉన్న పొడవాటి, దట్టమైన జుట్టును పూర్తిగా తొలగించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది.

కత్తిరించిన జుట్టును విరాళంగా ఇవ్వనున్నట్లు బార్ సిబ్బంది చెప్పినట్లు సమాచారం.

అయితే బార్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విచారణకు ఆదేశించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం

థాయ్‌లాండ్‌కు చెందిన ‘బీ వన్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు చాలిదా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

మేనేజర్ ఆగ్రహంతో ఈ పని చేశారని ఆమె తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నష్టపరిహారం చెల్లించేందుకు బార్ యాజమాన్యం సిద్ధపడిందని చెప్పారు.

తీవ్ర ఒత్తిడిలో కుదుర్చుకున్న ఒప్పందాలు చట్టబద్ధం కావని చాలిదా పేర్కొన్నారు. ఈ ఘటనపై థాయ్‌లాండ్ సామాజిక అభివృద్ధి, మానవ భద్రతా మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది.

సోషల్ మీడియాలో తీవ్ర దుమారం

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

కొందరు క్రిమినల్ కేసులను ఎదుర్కొనే కంటే మహిళకు ఇదే నయమని అభిప్రాయపడ్డారు.

మరికొందరు మాత్రం బార్ సిబ్బంది చర్యను తీవ్రంగా తప్పుబట్టారు.

“బార్ సిబ్బందికి ఇలాంటి కేసులతో డీల్ చేయడం అలవాటుగా ఉన్నట్లు ఉంది.

ఆమె ఒంటిపై ఎలాంటి బంగారం లేకపోవడంతో, చివరికి ఆమె విలువైన జుట్టునే తీసేసుకున్నారు” అని ఓ నెటిజన్ సెటైర్ వేశారు.

“పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? వారితోనే ఈ వ్యవహారం తేల్చుకోవచ్చుగా? దీనిని నేను పూర్తిగా దాడిగా భావిస్తున్నాను” అంటూ మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media