ఒక్కసారిగా గుండెపోటు.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి
ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో విషాద ఘటన చోటుచేసుకుంది.
తన ఏడాది కుమారుడిని ఆడిస్తూ సంతోషంగా గడుపుతున్న శిరీష.. ఫోన్‌లో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఆకస్మిక గుండెపోటుతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
బాబును ఆడిస్తూ.. ఫోన్‌లో మాట్లాడుతూ..
శిరీష తన పుట్టింటికి వచ్చింది. తల్లిగారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఏడాది వయస్సున్న తన కుమారుడిని ఆడిస్తూ గడిపింది.
బాబుకు బుడి బుడి అడుగులు వేయిస్తూ, జోల పాడుతూ సంతోషంగా ఉంది.
ఈ క్రమంలో శిరీష తన తోడికోడలితో ఫోన్‌లో మాట్లాడుకుంటూ డాబాపైకి వెళ్లింది.
మాట్లాడుతున్న సమయంలోనే ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
చిన్నారి ఏడుపుతో కుటుంబ సభ్యులు పరుగులు
అదే సమయంలో డాబాపై ఉన్న చిన్నారి ఏడవడం మొదలుపెట్టాడు.
చిన్నారి ఏడుపు, కేకలు వినిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే డాబాపైకి వెళ్లి చూడగా శిరీష అపస్మారక స్థితిలో పడి కనిపించింది.
దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స కోసం తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో శిరీష మృతి చెందింది.
పుట్టింటికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు
శిరీషకు రఘునాథపాలెం మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
పిండిప్రోలు గ్రామంలోని తన పుట్టింటికి వచ్చిన ఆమె.. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది.
చిన్నారి కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
శిరీష మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.



