అర్ధరాత్రి మహిళపై లైంగిక దాడి యత్నం.. కాపాడిన వీధి కుక్కలు!

September 4, 2026 5:10 PM

అర్ధరాత్రి మహిళపై దాడికి యత్నం

తమిళనాడులోని కోయంబత్తూరులో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు పక్కన నిద్రిస్తున్న మానసిక దివ్యాంగురాలైన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు.

అయితే అక్కడే ఉన్న రెండు వీధి కుక్కలు వెంటనే స్పందించి ఆమెను కాపాడాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో తుడియలూరు పరిధిలోని జాతీయ రహదారి రైల్వే వంతెన కింద ఈ ఘటన జరిగింది.

వీధుల్లో జీవనం సాగిస్తున్న ఓ మానసిక దివ్యాంగురాలు రోడ్డు పక్కన పడుకుని ఉంది.

ఒంటరిగా ఉందని గమనించి..

అటుగా వెళ్తున్న భూపతి అనే యువకుడు పరిసరాల్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు.

దీంతో మహిళ దగ్గరకు వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.

భయంతో ఆ మహిళ రక్షించాలంటూ గట్టిగా కేకలు వేసింది. అర్ధరాత్రి కావడంతో ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ అక్కడికి రాలేదు.

ఆమె తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ, మద్యం మత్తులో ఉన్న నిందితుడు ఆమెను బలంగా అదిమిపట్టి దాడికి ప్రయత్నించాడు.

మహిళ కేకలు విని కుక్కల రాక

అదే సమయంలో అక్కడ ఉన్న రెండు వీధి కుక్కలు మహిళ ఆర్తనాదాలను విన్నాయి.

వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిపై గట్టిగా మొరుగుతూ దూకాయి.

కుక్కలు దాడి చేస్తున్నప్పటికీ నిందితుడు మహిళను వదలకుండా ప్రయత్నించాడు.

దీంతో ఆ కుక్కలు అతడిని కొరికి అక్కడి నుంచి తరిమికొట్టాయి.

కుక్కల దాడితో భయపడిన భూపతి మహిళను వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు.

సీసీటీవీలో మొత్తం ఘటన

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన తుడియలూరు పోలీసులు నిందితుడు భూపతిని అరెస్ట్ చేశారు.

ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

మహిళకు సాయం చేసేందుకు మనుషులు రాని సమయంలో రెండు వీధి కుక్కలు స్పందించి ఆమెను రక్షించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కల విశ్వాసం, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media