ఒకరిని కాపాడిన స్థానికులు
చించినాడ బ్రిడ్జిపై విషాద ఘటన
AP: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ తన భార్య పద్మిని, కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె నిత్యశ్రీతో కలిసి Chinchinada బ్రిడ్జి వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనను గమనించిన స్థానిక జాలర్లు వెంటనే స్పందించారు. శ్రీనివాస్ భార్య పద్మినిని వారు కాపాడారు. అయితే శ్రీనివాస్, ఆయన కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు.
పద్మినికి ఆసుపత్రిలో చికిత్స
గోదావరిలో నుంచి బయటకు తీసిన పద్మిని అపస్మారక స్థితిలో ఉండటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతైన శ్రీనివాస్, వెంకటేశ్వర్, నిత్యశ్రీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
తణుకుకు చెందిన శ్రీనివాస్, పద్మిని దంపతులు స్థానికంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు వెంకటేశ్వర్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు.
కుమార్తె నిత్యశ్రీ 9వ తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ కారణంగానే కుటుంబం ఆత్మహత్యకు యత్నించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
వారం రోజుల్లో రెండో ఘటన
చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకడం వారం రోజుల్లో ఇది రెండో ఘటన. గత వారం కూడా ఓ కుటుంబం ఇదే తరహాలో ఆత్మహత్యాయత్నం చేసింది.
అయితే సకాలంలో స్పందించిన మత్స్యకారులు వారిని కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఆ ఘటన మరువకముందే మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



