మూత్రం నుంచి విద్యుత్, పోషకాలను వేరు చేసిన డచ్ శాస్త్రవేత్తలు
- నెదర్లాండ్స్‌లోని ఫ్రైస్‌లాండ్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్‌లో మూత్రం నుంచి విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేశారు.
- ఈ విద్యుత్తుతో ఎలక్ట్రిక్ కారును రోజుకు సుమారు 50 కిలోమీటర్లు నడిపేందుకు అవసరమైన ఛార్జింగ్ అందించారు.
- మూత్రంలోని నైట్రోజన్, ఫాస్ఫరస్‌ను ఎరువుల తయారీకి, భవిష్యత్తులో హైడ్రోజన్ ఉత్పత్తికి ఉపయోగించే అవకాశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
వ్యర్థంగా పరిగణించే మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చా? నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు దీనికి అవుననే సమాధానం చెబుతున్నారు. మూత్రం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆ విద్యుత్తుతో ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేసి చూపించారు. దీంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే విలువైన పోషకాలను కూడా మూత్రం నుంచి వేరు చేశారు.
ఫ్రైస్‌లాండ్‌లో పైలట్ ప్రాజెక్ట్
నెదర్లాండ్స్‌లోని ఫ్రైస్‌లాండ్‌లో ఉన్న ఒక వాటర్ బోర్డ్ కార్యాలయంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ‘వెట్సస్’ అనే వాటర్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించింది.
ఆ కార్యాలయంలో పనిచేసే సుమారు 260 మంది పురుష ఉద్యోగుల కోసం ప్రత్యేక యూరినల్స్ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా సేకరించిన మూత్రాన్ని బ్యాక్టీరియా ఆధారిత ఎలక్ట్రోకెమికల్ వ్యవస్థకు తరలించారు.
ఈ విధానంతో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఉపయోగించి కార్యాలయంలోని ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ అందించారు. ఆ ఛార్జింగ్‌తో కారు రోజుకు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన శక్తిని పొందడం విశేషం.
బ్యాక్టీరియాతో విద్యుత్ ఉత్పత్తి
ఈ సాంకేతికతలో బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిజన్ లేని వాతావరణంలో బ్యాక్టీరియా మూత్రంలోని కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి.
ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. సాధారణ మురుగునీటిలో కలిసిపోయే ముందే మూత్రాన్ని ప్రత్యేకంగా సేకరించడం వల్ల ఈ ప్రక్రియను నిర్వహించడం సాధ్యమైంది.
ఎరువుల తయారీకి నైట్రోజన్, ఫాస్ఫరస్
ఈ ప్రక్రియ ద్వారా విద్యుత్తుతో పాటు అమ్మోనియా, ఫాస్ఫేట్ వంటి విలువైన పోషకాలను కూడా వేరు చేశారు.
మొత్తం మురుగునీటిలో మూత్రం ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. అందులో 85-90 శాతం నైట్రోజన్, 50-80 శాతం ఫాస్ఫరస్ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని ఎరువుల తయారీలో ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
భవిష్యత్తులో హైడ్రోజన్ ఉత్పత్తి
ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి పెద్ద స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు హైడ్రోజన్‌ను కూడా తయారు చేయాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూత్రాన్ని కేవలం వ్యర్థంగా కాకుండా.. విద్యుత్, ఎరువులకు అవసరమైన పోషకాలు వంటి విలువైన వనరులుగా ఉపయోగించుకునే దిశగా ఈ ప్రయోగం కొత్త అవకాశాలను చూపిస్తోంది.



