80ల లుక్ ఇప్పుడు ట్రెండింగ్
ఒకప్పుడు 80ల నాటి ఫొటో కావాలంటే పాత ఆల్బమ్ తెరవాల్సిందే. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. చేతిలో ఉన్న ఒక్క సెల్ఫీతోనే అప్పటి లుక్‌ను సులభంగా తీసుకురావచ్చు.
చాట్‌జీపీటీలో ఫొటో అప్‌లోడ్ చేస్తే చాలు. పెద్ద జుట్టు, అప్పటి ఫ్యాషన్ దుస్తులు, స్టూడియో లైటింగ్, పాతకాలపు ఫిల్మ్ గ్రెయిన్‌తో ఫొటోను మార్చేస్తోంది.
ఫలితాలు కూడా చాలా సహజంగా కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ వేగంగా వైరల్ అవుతోంది. చాలామంది తమ ప్రస్తుత ఫొటోలను 80ల స్టైల్‌లోకి మార్చుకుని షేర్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రెండ్‌తో పాటు కొన్ని ప్రైవసీ రిస్క్‌లు కూడా ఉన్నాయి. ఫొటో అప్‌లోడ్ చేసే ముందు వాటిని తెలుసుకోవడం మంచిది.
ఫొటోలో కనిపించేది మాత్రమే డేటా కాదు
మనం ఒక ఫొటోను చూస్తే అందులో కనిపించే ముఖం, దుస్తులు మాత్రమే గమనిస్తాం. కానీ డిజిటల్ ఫొటోలో మరింత సమాచారం ఉండే అవకాశం ఉంది.
ఫొటో ఫైల్‌లో తేదీ, ఏ పరికరంతో ఫొటో తీశారు వంటి మెటాడేటా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లొకేషన్ వివరాలు కూడా అందులో ఉండే అవకాశం ఉంది.
అంతేకాదు. ఫొటో బ్యాక్‌గ్రౌండ్ కూడా ముఖ్యమే. ఇంటి నంబర్, రోడ్డు పేరు, వాహనం నంబర్ ప్లేట్, కార్యాలయం వంటి వివరాలు కనిపిస్తే వ్యక్తిగత సమాచారం బయటపడొచ్చు.
ఫొటోలో మనతో పాటు మరో వ్యక్తి కనిపించినా సమస్య కావచ్చు. ముఖ్యంగా పిల్లల ఫొటోలను వారి అనుమతి లేకుండా అప్‌లోడ్ చేయడం మంచిది కాదు.
ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత?
చాట్‌జీపీటీలో ఫొటో అప్‌లోడ్ చేస్తే అది మన ఇంటరాక్షన్‌లో భాగమవుతుంది. ఆ డేటాను ఎలా నిర్వహిస్తారనేది మనం ఉపయోగిస్తున్న సేవ, ఖాతా రకం, డేటా సెట్టింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది.
కన్జ్యూమర్ ఖాతాల్లోని కంటెంట్‌ను మోడళ్లను మెరుగుపరచడానికి ఉపయోగించే అవకాశం ఉందని ఓపెన్‌ఏఐ చెబుతోంది. అయితే ప్రతి ఫొటోను ఆటోమేటిక్‌గా ఏఐ శిక్షణకు ఉపయోగిస్తారని దీని అర్థం కాదు.
ఇక్కడ వినియోగదారుడి డేటా సెట్టింగ్స్ కూడా కీలకంగా ఉంటాయి. బిజినెస్ ఉత్పత్తులు, ఏపీఐ డేటాను డిఫాల్ట్‌గా మోడల్ శిక్షణకు ఉపయోగించబోమని ఓపెన్‌ఏఐ పేర్కొంది.
సాధారణ సెల్ఫీతో ప్రమాదమా?
సాధారణ సెల్ఫీని నమ్మకమైన ఏఐ సేవలో అప్‌లోడ్ చేస్తే తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుందని చెప్పలేం. కానీ జాగ్రత్త మాత్రం అవసరం.
ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత అది మన ఫోన్‌లో మాత్రమే ఉండదు. సేవను బట్టి అది సంబంధిత సిస్టమ్స్‌లో ప్రాసెస్ కావచ్చు.
అందుకే ఏ ఫొటో పడితే ఆ ఫొటోను ఏఐకి అప్‌లోడ్ చేయడం మంచిది కాదు.
ఈ ఫొటోలను అప్‌లోడ్ చేయొద్దు
గుర్తింపు కార్డులు, వ్యక్తిగత రికార్డులు, అత్యంత సున్నితమైన ఫొటోలను ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్ చేయకపోవడం మంచిది.
ప్రైవేట్ లేదా సన్నిహిత చిత్రాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇతరుల ఫొటోలను కూడా వారి అనుమతి లేకుండా అప్‌లోడ్ చేయకూడదు.
ముఖ్యంగా పిల్లల ఫొటోల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
అప్‌లోడ్ ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఫొటోలో అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ముందే కట్ చేయొచ్చు. ఇంటి నంబర్ కనిపిస్తే దాన్ని బ్లర్ చేయండి.
వాహనం నంబర్ ప్లేట్ కనిపిస్తే దానిని కూడా బ్లర్ చేయడం మంచిది. కార్యాలయ సమాచారం, వ్యక్తిగత పత్రాలు లేదా ఇతర సున్నితమైన వివరాలు కనిపించకుండా చూసుకోవాలి.
అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా ఒకసారి పరిశీలించాలి.
ChatGPTలో ప్రైవసీ సెట్టింగ్స్
చాట్‌జీపీటీలో Settings > Data Controlsలోకి వెళ్లి “Improve the model for everyone” ఆప్షన్‌ను ఆఫ్ చేయొచ్చు.
కొత్త సంభాషణలను మోడల్ మెరుగుదలకు ఉపయోగించకూడదనుకునేవారికి ఈ సెట్టింగ్ ఉపయోగపడుతుంది.
మరో మార్గం Temporary Chat. ఓపెన్‌ఏఐ ప్రకారం.. ఇలాంటి చాట్లను మోడల్ శిక్షణకు ఉపయోగించరు. అవి చాట్ హిస్టరీలోనూ కనిపించవు.
కొన్ని మినహాయింపులు మినహా టెంపరరీ చాట్లను 30 రోజుల్లో సిస్టమ్స్ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిస్తారు.
ఒక్క ఫొటోకు కూడా విద్యుత్ ఖర్చే
ఈ ట్రెండ్‌లో మరో అంశం కూడా ఉంది. ఏఐతో ఒక ఫొటో తయారు చేయడానికి కూడా విద్యుత్ అవసరం.
కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, హగ్గింగ్ ఫేస్ పరిశోధన ప్రకారం.. ఏఐ ఇమేజ్ తయారీకి సిస్టమ్, ప్రక్రియను బట్టి సుమారు 0.01 నుంచి 0.29 కిలోవాట్ అవర్ వరకు విద్యుత్ ఖర్చు కావచ్చు.
ఒక్క ఫొటోకు ఇది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ లక్షల మంది ఒకేసారి ఇదే ట్రెండ్‌ను ఫాలో అయితే మొత్తం ప్రభావం పెరుగుతుంది.
అందుకే ఒకే ఫొటోకు పదుల కొద్దీ ఏఐ చిత్రాలు తయారు చేయడం కంటే అవసరమైనన్ని మాత్రమే రూపొందించడం మంచిది.



