భారీ జీతంతో పాటు ఉద్యోగులకు ఎన్నో సౌకర్యాలు
ఇంటర్న్ నుంచి సీనియర్ ఇంజినీర్ వరకు భారీ ప్యాకేజీలు
గూగుల్‌లో ఉద్యోగం కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి
టెక్ ప్రపంచంలో గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం ఎంతో మంది యువత కల. గూగుల్‌లో పనిచేయడమంటే కేవలం భారీ జీతం, సరికొత్త ప్రాజెక్టులు మాత్రమే కాదు. ఉద్యోగి జీవితాన్ని, వారి కుటుంబాన్ని వివిధ విధాలుగా ఆదుకునే ప్రయోజనాలు కూడా సంస్థ అందిస్తోంది.
ఆరోగ్యం, ఆర్థిక భద్రత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, కెరీర్ ఎదుగుదలకు గూగుల్ ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగులకు అందించే ఈ సౌకర్యాలు సంస్థలో పనిచేసే వారికి అదనపు ప్రయోజనంగా ఉంటాయి.
ఉద్యోగి కుటుంబానికీ వైద్య ప్రయోజనాలు
గూగుల్ ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య, దంత, దృష్టి సంబంధిత పూర్తి బీమా సౌకర్యం లభిస్తుంది. అవసరమైన సమయంలో ప్రముఖ వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఆఫీసుల్లో వెల్నెస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మెంటల్ హెల్త్ యాప్స్, ప్రత్యేక సహాయ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య సపోర్ట్ ప్రోగ్రామ్ ఉంది. మహిళల ఋతుచక్ర సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కూడా సంస్థ అందిస్తోంది.
భారతదేశంలో భారీ వార్షిక ప్యాకేజీలు
వివిధ నివేదికల ప్రకారం.. భారతదేశంలో గూగుల్ ఉద్యోగుల సగటు వార్షిక పరిహారం సుమారు రూ. 55.4 లక్షలు. అనుభవం, హోదాను బట్టి ప్యాకేజీలో తేడా ఉంటుంది.
సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌లకు ఏడాదికి రూ.13.3 లక్షల నుంచి రూ.19.1 లక్షల వరకు అందుతుంది. ఇతర సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ హోదాల్లో రూ.32.3 లక్షల నుంచి రూ.40.6 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ లభిస్తుంది.
ఇంజినీరింగ్, ప్రోగ్రామ్ మేనేజర్లకు రూ.36.7 లక్షల నుంచి రూ.44.5 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది. టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లకు రూ.47.6 లక్షల నుంచి రూ.53.9 లక్షల వరకు ఉంటుంది.
స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు రూ.93.6 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇంజినీరింగ్ మేనేజర్లకు రూ.1.1 కోట్ల నుంచి రూ.1.6 కోట్ల వరకు ప్యాకేజీలు ఉంటాయి.
క్లౌడ్ విభాగంలోని సీనియర్ స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ప్యాకేజీ రూ.2.6 కోట్ల నుంచి రూ.2.9 కోట్ల వరకు ఉంటుందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.
జీతంతో పాటు బోనస్‌లు, స్టాక్స్
గూగుల్ ఉద్యోగులకు బేస్ శాలరీతో పాటు క్రమమైన బోనస్‌లు కూడా లభిస్తాయి. స్టాక్స్ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
స్టూడెంట్ లోన్ రీపేమెంట్ సాయం కూడా అందుతుంది. పర్సనల్ ఫైనాన్స్ కోచింగ్ ద్వారా ఉద్యోగులు తమ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
సెలవులు, హైబ్రిడ్ వర్క్ మోడల్
ఉద్యోగులకు వెకేషన్ సెలవులు, పేరెంటల్ లీవ్, సిక్ లీవ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. హైబ్రిడ్ వర్క్ మోడల్ కూడా అందుబాటులో ఉంది.
ఉద్యోగులు సంవత్సరానికి 4 వారాల పాటు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పని చేసే వెసులుబాటు ఉంది. పేరెంటింగ్ సపోర్ట్ కూడా అందుతుంది.
సంతాన సాఫల్య సాయం, కేరర్స్ లీవ్, వృద్ధుల సంరక్షణ, బ్యాకప్ చైల్డ్ కేర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
అనుకోని విపత్తు సమయంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు సర్వైవర్స్ ఇన్కమ్ బెనిఫిట్ కూడా అమలు చేస్తున్నారు.
ఆఫీసులోనే ఆహారం, ఫిట్నెస్ సౌకర్యాలు
గూగుల్ ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉచిత పౌష్టికాహారం, స్నాక్స్ అందుబాటులో ఉంటాయి. ఫిట్నెస్ సెంటర్లు కూడా ఉంటాయి.
మసాజ్ థెరపీలతో పాటు వంట, ఆర్ట్స్ తరగతులు నిర్వహిస్తారు. ఉద్యోగులు తమ పెంపుడు కుక్కలను ఆఫీసుకు తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రసిద్ధ డగ్లర్స్ సంస్కృతి కూడా గూగుల్ ప్రత్యేకతల్లో ఒకటి.
ప్రముఖుల ప్రసంగాలతో కూడిన టాక్స్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వీటి ద్వారా ఉద్యోగులకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కెరీర్ ఎదుగుదలకు ప్రత్యేక అవకాశాలు
ఉద్యోగుల కెరీర్ ఎదుగుదలకు కూడా గూగుల్ పలు అవకాశాలు కల్పిస్తోంది. ఎడ్యుకేషన్ రీయింబర్స్మెంట్ అందుతుంది.
సహోద్యోగుల నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు గూగ్లర్ టు గూగ్లర్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా సంస్థలోని ఇతర ఉద్యోగుల అనుభవం, నైపుణ్యాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
గూగుల్‌లో ఉద్యోగం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
గూగుల్‌లో ఉద్యోగం కోసం ముందుగా గూగుల్ కెరీర్స్ పోర్టల్‌లో ప్రొఫైల్ రూపొందించుకోవాలి.
పాత రెజ్యూమేను అలాగే పంపించడం కంటే.. దరఖాస్తు చేసుకునే రోల్‌కు అవసరమైన స్కిల్స్‌కు అనుగుణంగా ఫ్రెష్ రెజ్యూమే సిద్ధం చేసుకోవాలి.
ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలు, స్కిల్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.
గూగుల్ పనితీరు, ఉత్పత్తులపై మంచి అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
రెజ్యూమే షార్ట్‌లిస్ట్ అయితే హెచ్ఆర్ బృందం అభ్యర్థిని సంప్రదిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
టెక్నికల్, బిహేవియరల్ ఇంటర్వ్యూలు
ఇంటర్వ్యూ ప్రక్రియలో టెక్నికల్ రౌండ్లతో పాటు బిహేవియరల్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. అభ్యర్థి టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు.
ఈ రౌండ్లలో ప్రతిభ కనబరిస్తే తుది జాబ్ ఆఫర్ లభిస్తుంది. అందుకే గూగుల్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ రెజ్యూమేను సంబంధిత రోల్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవడం, అవసరమైన స్కిల్స్‌పై దృష్టి పెట్టడం కీలకం.



