ఖమ్మం-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం
ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి సమీపంలో డాక్టర్ కాసకుర్తి జగదీశ్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న డాక్టర్ జగదీశ్ సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మమత హాస్పిటల్లో న్యూరో సర్జన్‌గా సేవలు
డాక్టర్ కాసకుర్తి జగదీశ్ (50) ఖమ్మంలోని మమత హాస్పిటల్లో న్యూరో సర్జన్‌గా సేవలందిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము వరకు ఆయన శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌లోని తన ఇంటికి కారులో బయలుదేరారు.
పిల్లలమర్రి సమీపానికి చేరుకున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరించామని చెప్పారు. కారు అదుపుతప్పడానికి కారణమేంటి? ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశాలతో పాటు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు.
ఇది కూడా చదవండి
సాయి పల్లవి చీరకట్టుకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. దీపావళికి పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్!
డాక్టర్ జగదీశ్ రాత్రంతా శస్త్రచికిత్స నిర్వహించి హైదరాబాద్‌కు బయలుదేరిన నేపథ్యంలో నిద్రమత్తు కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తులో తేలాల్సి ఉంది.
కుటుంబంలో విషాదం
వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ జగదీశ్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


