బీహార్‌లో దారుణ ఘటన
బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలులో స్మోకింగ్ చేసిన దివ్యాంగ యువకుడిని ఓ వ్యక్తి నకిలీ పోలీస్‌గా నటించి బెదిరించాడు. రూ.20,000 జరిమానా విధించాడు.
ఆ డబ్బు చెల్లించలేదని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి సొంతూరికి బయలుదేరిన నితిన్
వైశాలి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నితిన్ కుమార్ హైదరాబాద్‌లో కూలీగా పనిచేసేవాడు.
సెప్టెంబర్ 19న హైదరాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్‌లో బీహార్‌లోని తన సొంతూరికి బయలుదేరాడు.
నితిన్ దివ్యాంగుడు. దీంతో రైలులోని వికలాంగుల కోచ్‌లో ప్రయాణించాడు. సెప్టెంబర్ 20న రాత్రి సమయంలో అతడు రైలులో స్మోక్ చేశాడు.
ఆ సమయంలో ఓ వ్యక్తి వికలాంగుల కోచ్‌లోకి వచ్చాడు. తాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారినని చెప్పాడు. టికెట్ చెకింగ్ టాస్క్ ఫోర్స్ అధికారిగా కూడా నటించాడు.
రైలు ప్రయాణికులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.
రూ.20 వేల జరిమానా అంటూ బెదిరింపు
నితిన్ సిగరెట్ కాల్చడాన్ని ఆ వ్యక్తి గమనించాడు. తాను రైల్వే పోలీస్ అధికారినని చెప్పి నితిన్‌ను బెదిరించాడు. స్మోకింగ్ చేసినందుకు రూ.20,000 జరిమానా విధిస్తున్నట్లు చెప్పాడు.
ఆ తర్వాత బక్సర్ స్టేషన్‌లో నితిన్‌ను బలవంతంగా రైలు నుంచి దించాడు. రాత్రి సమయంలో నితిన్ మొబైల్ ఫోన్ నుంచి అతడి కుటుంబ సభ్యులకు కాల్ చేయించాడు. రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
మరుసటి రోజు డబ్బు పంపుతామని నితిన్ కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వారు తమ కుమారుడి ఫోన్‌కు రూ.5,000 పంపారు.
మరుసటి రోజు మళ్లీ డబ్బు డిమాండ్
సెప్టెంబర్ 21 ఉదయం నితిన్ మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు మరోసారి ఫోన్ వచ్చింది. ఈసారి ఆ వ్యక్తి రూ.20,000 డిమాండ్ చేశాడు.
డబ్బు కోసం రోజంతా నితిన్ ఫోన్ నుంచే అతడి కుటుంబ సభ్యులకు పలు కాల్స్ చేశాడు. అయితే కుటుంబ సభ్యులు నితిన్‌తో నేరుగా మాట్లాడలేకపోయారు.
దీంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే గ్రామ పెద్దతో కలిసి బక్సర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నితిన్ కనిపించడం లేదని, అతడి ఫోన్ నుంచి మరో వ్యక్తి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక బృందంతో దర్యాప్తు
ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దానాపూర్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కాంచన్ రాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు, అందిన సమాచారాన్ని పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
మోహన్‌సరాయ్ ప్రాంతంలో రోహిత్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నితిన్‌ను కదులుతున్న రైలు నుంచి తోసేసినట్లు అతడు చెప్పాడు. డిమాండ్ చేసిన డబ్బు అందకపోవడంతో ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే పట్టాల వద్ద నితిన్ మృతదేహం
నిందితుడు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు మరింతగా ఆరా తీశారు. ఆరా-జగ్‌జీవన్ హాల్ట్ మధ్య రైల్వే పట్టాల వద్ద ఓ మృతదేహాన్ని గుర్తించారు.
ఆ మృతదేహం నితిన్‌దేనని అతడి తండ్రి గుర్తించినట్లు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు.
రోహిత్‌పై గతంలోనూ కేసులు
అరెస్టైన నిందితుడు రోహిత్ తివారీపై గతంలో పలు కేసులు నమోదయ్యాయని రైల్వే పోలీసులు తెలిపారు.
అతడు 25 నెలల పాటు జైలులో ఉన్నట్లు చెప్పారు. రెండు నెలల కిందట బెయిల్‌పై విడుదలైనట్లు వివరించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.



