అర్హత ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటున్న గ్రామస్తులు
తొర్రూరు: ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించాల్సిన రెవెన్యూ శాఖ అధికారుల తీరుపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీ విషయంలో అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై హరిపిరాల గ్రామస్తులు తొర్రూరు తహసీల్దార్ గడిల శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా చూడాలని కోరారు. అలాగే తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సర్టిఫికెట్ల కోసం డబ్బులు అడుగుతున్నారని ఆరోపణ
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం.. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ల కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నా పలు కారణాలతో వాటిని తిరస్కరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు.
ఆ తర్వాత సంబంధిత కార్యాలయాలను ఆశ్రయిస్తే డబ్బులు చెల్లించిన తర్వాత పనులు పూర్తవుతున్నాయని ఆరోపించారు.
కొన్ని సందర్భాల్లో సర్టిఫికెట్లపై సంతకాల కోసం కూడా డబ్బులు అడుగుతున్నారని గ్రామస్థులు తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీపీఓపై గతంలోనూ ఫిర్యాదులు
హరిపిరాల, కర్కాల గ్రామాలకు జీపీఓగా పనిచేస్తున్న గాదరబోయిన అచ్చయ్యపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.
తాజాగా హరిపిరాల గ్రామస్థులు మరోసారి తహసీల్దార్‌ను ఆశ్రయించారు. గాదరబోయిన అచ్చయ్యను మార్చాలని కోరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజలను వివిధ కారణాలతో కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు.
చివరికి డబ్బులు తీసుకున్న తర్వాత పనులు పూర్తి చేస్తున్నారని ఆరోపించారు.
రూ.3 వేలు చెల్లించినా సర్టిఫికెట్ రాలేదని ఆరోపణ
హరిపిరాల గ్రామానికి చెందిన మిట్టకోల అశోక్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
తన పెద్దనాన్న మిట్టకోలా నారాయణకు సంబంధించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
ఈ ప్రక్రియలో రూ.2 వేలు తీసుకున్నారని అశోక్ చెప్పారు. అనంతరం ఫోన్‌పే ద్వారా మరో రూ.వెయ్యి పంపించినట్లు తెలిపారు.
అయితే ఇప్పటివరకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ కాలేదని ఆయన పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించి సర్టిఫికెట్ ఇప్పించాలని ఉన్నతాధికారులను కోరారు.
విచారణ జరిపిస్తామన్న తహసీల్దార్
జీపీఓ గాదరబోయిన అచ్చయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తొర్రూరు తహసీల్దార్ గడిల శ్రీనివాస్ తెలిపారు.
ఇది కూడా చదవండి
సాయి పల్లవి చీరకట్టుకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. దీపావళికి పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్!
గతంలోనూ ఆయనపై ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ సేవల విషయంలో అక్రమాలకు, అవకతవకలకు తావు లేదని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమగ్ర విచారణకు గ్రామస్థుల డిమాండ్
ఈ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని హరిపిరాల గ్రామస్థులు కోరుతున్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హరిపిరాల జీపీఓను మార్చాలని కోరుతున్నారు.
ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


