రోజుకు 4 గంటల పని సరిపోతుంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగ ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. AI వల్ల కొన్ని ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలా? అనే చర్చ కూడా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రోజుకు గంటల కొద్దీ పనిచేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పూర్తి ఏకాగ్రతతో నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుందని చెప్పారు.
అక్టోబర్ 3న బెంగళూరులో జరిగిన 18వ ‘ఎడిషన్ సప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ (PMSAC)’లో చేతన్ భగత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చేతన్ భగత్ ఏం చెప్పారు?
‘నేను రోజుకు నాలుగు గంటలు పనిచేస్తాను. పూర్తి అంకితభావంతో పనిచేస్తే ఆ సమయం సరిపోతుంది’ అని చేతన్ భగత్ అన్నారు.
అయితే తాను చెప్పే నాలుగు గంటల పని సమయంలో సమావేశాలు, విరామాలు, ఇతర పనులతో ఏర్పడే అంతరాయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
నిజమైన ఏకాగ్రతతో నాలుగు గంటలు పనిచేస్తే మంచి ఉత్పాదకత సాధించవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు.
చేయాల్సిన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యాలయంలో ఉద్యోగి ఎంతసేపు ఉన్నాడనేది ముఖ్యం కాదని చెప్పారు. ఆ సమయంలో ఎంత నాణ్యమైన పని చేశాడనేదే ముఖ్యమని చేతన్ భగత్ అభిప్రాయపడ్డారు.
AIతో మారుతున్న పని విధానం
AI కారణంగా ప్రస్తుతం పని విధానం వేగంగా మారుతోంది. గతంలో మనుషులు గంటల తరబడి చేసే అనేక పనులను ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీలు తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి.
దీంతో ఉత్పాదకత, ఉద్యోగ భద్రత, ఆటోమేషన్ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయడం కంటే తమ పనిపై పూర్తి దృష్టి పెట్టడం అవసరమని చేతన్ భగత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యమైన పని చేయడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చనే అభిప్రాయం ఇప్పుడు చర్చకు వస్తోంది.
వారానికి 70 గంటల పని చర్చ
భారత్‌లో పని గంటలపై గతంలో కూడా పెద్ద చర్చ జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో సూచించారు.
దేశ ఉత్పాదకత, పోటీతత్వం పెరగాలంటే ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను కూడా నాలుగు దశాబ్దాలకు పైగా వారానికి 70 గంటలు పనిచేశానని నారాయణమూర్తి గతంలో వెల్లడించారు. భారత్‌లో ఆరు రోజుల పని విధానం ఉన్న సమయంలో వారానికి 85 నుంచి 90 గంటల వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.
అయితే చేతన్ భగత్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఎక్కువ గంటలు పనిచేయడం కంటే ఏకాగ్రత, పనులకు ప్రాధాన్యత ఇవ్వడం, వ్యక్తిగత సంతోషంపై దృష్టి పెట్టాలని ఆయన చెబుతున్నారు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా ముఖ్యం
బెంగళూరు సమావేశంలో చేతన్ భగత్‌ను వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా ప్రశ్నించారు.
వ్యక్తులు తమకు సంతోషాన్ని ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. జీవితంలో ఏం చేయాలి? ఏ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? అనే దానిపై స్పష్టత ఉండటం ముఖ్యమని చెప్పారు.
తన ‘11 Rules for Life’ పుస్తకంలోని కొన్ని సూత్రాలను కూడా ఆయన ప్రస్తావించారు.
జీవితంలో ప్రతి విషయానికీ ఒకే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సంతోషంతో పాటు పని విషయంలో కూడా సరైన సమతుల్యత అవసరమని సూచించారు.
చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు
AI వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని సంస్థలు ఉత్పాదకతను పెంచాలని చూస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్యోగుల పని గంటలపై చర్చ జరుగుతోంది.
ఇలాంటి సమయంలో రోజుకు నాలుగు గంటలు పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తే సరిపోతుందని చేతన్ భగత్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆయన వ్యాఖ్యలు ఎక్కువ గంటలు పనిచేయడం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలనే అంశాన్ని ముందుకు తెచ్చాయి.


