మహారాష్ట్రలో దారుణం.. టీవీ విషయంలో గొడవ, 17 ఏళ్ల కుమార్తెను బ్యాట్‌తో కొట్టిన తండ్రి

October 6, 2026 5:54 PM

టీవీ చూసే విషయంలో తగాదా

సాతారా: మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. టీవీ చూసే విషయంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 17 ఏళ్ల కుమార్తెను ఆమె తండ్రి క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సాతారా జిల్లాలో జరిగింది.

టీవీ విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ

మృతురాలిని ఆర్యా కదమ్గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ఇంట్లో టీవీ చూసే విషయంలో ఆర్యాకు తన తమ్ముడు, చెల్లితో గొడవ జరిగింది. ఈ సమయంలో ఆర్యా తన చెల్లి కంటిపై పిడికిలితో కొట్టినట్లు పోలీసులు చెప్పారు.

దీంతో తండ్రి పురుషోత్తమ్ ఆమెను మందలించారు. తండ్రి మందలించడంతో ఆర్యా మరింత ఆగ్రహానికి గురైంది. చేతిలో బ్యాట్ పట్టుకుని తండ్రి వైపు దూసుకెళ్లింది. ఈ సమయంలో ఆమె అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.

బ్యాట్ లాక్కొని తలపై కొట్టిన తండ్రి

కుమార్తె తనపైకి రావడంతో పురుషోత్తమ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆమె చేతిలో ఉన్న అదే బ్యాట్‌ను లాక్కున్నాడు. ఆ తర్వాత ఆర్యా తలపై బ్యాట్‌తో బలంగా కొట్టాడు.

తీవ్ర గాయాల కారణంగా ఆర్యా అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన తర్వాత పురుషోత్తమ్ చాలాసేపు కుమార్తె మృతదేహం వద్దే కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత తెల్లవారుజామున తన భార్య షీలాకు విషయం చెప్పాడు.

రక్తపు మరకలు తొలగించే ప్రయత్నం

హత్య విషయం బయటకు రాకుండా ఆధారాలను చెరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నేలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేశారు.

ఆర్యా ధరించిన టీషర్ట్‌పై ఉన్న రక్తాన్ని తొలగించేందుకు వాషింగ్ మెషీన్‌లో మూడుసార్లు ఉతికారు. రక్తపు మరకలు ఉన్న బ్యాట్‌ను ఇంటి పైకప్పుపైకి విసిరేశారు.

పోలీసులను తప్పుదోవ పట్టించిన కుటుంబం

ఆదివారం ఉదయం కుటుంబ బంధువులు, పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత ఆర్యా తనకు తానే తలపై కొట్టుకోవడంతో గాయపడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.

అయితే పోలీసులు అనుమానంతో విచారణ కొనసాగించారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ సమయంలో ఆర్యా తల్లి షీలా అసలు విషయాన్ని పోలీసులకు చెప్పింది.

ఆ తర్వాత పురుషోత్తమ్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇంటి పైకప్పుపై ఉన్న బ్యాట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

తండ్రి ఏమన్నాడంటే?

విచారణ సమయంలో పురుషోత్తమ్ తన కుమార్తె గురించి పలు విషయాలు చెప్పాడు. తన కుమార్తె తప్పుదోవ పట్టిందని, ఆమెకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పాడు.

ఆమె ప్రవర్తనతో విసిగిపోయి ఈ చర్యకు పాల్పడాల్సి వచ్చిందని పురుషోత్తమ్ పోలీసుల విచారణలో చెప్పాడు.

అయితే పొరుగువారు మాత్రం ఆర్యా గురించి భిన్నంగా చెప్పారు. ఆమె చాలా స్నేహపూర్వకంగా ఉండేదని తెలిపారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడేదని, చుట్టుపక్కల వారితో కలిసిమెలిసి ఉండేదని చెప్పారు.

ఆర్యాకు మానసిక సమస్యలకు చికిత్స

పురుషోత్తమ్, షీలా ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆర్యా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

ఆమె పుణెలోని ఓ సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతిరోజూ మందులు కూడా తీసుకునేదని చెప్పారు.

ఆర్యా మొబైల్ ఫోన్, టీవీని ఎక్కువగా ఉపయోగించేదని పోలీసులు తెలిపారు. చిన్న చిన్న విషయాలకే ఆమె తీవ్రంగా స్పందించేదని, కొన్నిసార్లు హింసాత్మకంగా మారేదని చెప్పారు.

గతంలోనూ తండ్రిపై దాడి

ఆర్యా గతంలో కూడా తండ్రిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఏడాది మేలో జరిగిన ఓ ఘటనలో ఆమె తండ్రిపై దాడి చేయడంతో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయినట్లు పోలీసులు తెలిపారు.

మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆమె తరచూ ఆందోళనకు గురయ్యేదని పోలీసులు చెప్పారు. కోపం, చిరాకు వంటి సమస్యల కారణంగా ఒకసారి ఆమెను ఆసుపత్రిలో కూడా చేర్పించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కేసుపై సాతారా సిటీ పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media