విశాఖపై పాక్ నిఘా.. 18 మంది అనుమానితుల గుర్తింపు
విశాఖపట్నం తూర్పు తీరంలో భారత నౌకాదళానికి అత్యంత కీలకమైన కేంద్రం. అందుకే ఈ ప్రాంతంపై శత్రుదేశాల నిఘా కూడా ఉంటోంది. తాజాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో కొందరు నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నారన్న సమాచారం ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు అందింది.
దీంతో సెప్టెంబర్ 2న విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో Crime No. 01/2026గా కేసు నమోదైంది. ఆ తర్వాత అధికారులు ఈ నెట్వర్క్ మూలాలను గుర్తించే పనిలో పడ్డారు.
నెలరోజులపాటు దర్యాప్తు సాగింది. అనంతరం అక్టోబర్ 1న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఫైర్ వాల్-2026 చేపట్టింది.
ఈ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు ఇద్దరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించాయని ఏపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మిగిలిన 16 మందిపై దర్యాప్తు కొనసాగుతోంది.
విశాఖకు చెందిన ఇద్దరిపై కీలక ఆధారాలు
గుర్తించిన వారిలో ఇద్దరు విశాఖకు చెందినవారు. వారిలో ఒకరు అన్నం సాయివరప్రసాద్.
సాయివరప్రసాద్ విశాఖలో నేవీ అధికారులకు కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల ప్రెస్ నోట్ ప్రకారం.. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌కు చేరవేయడంలో అతడి పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ వ్యవహారానికి సంబంధించి అతడు డబ్బులు కూడా అందుకున్నాడని పోలీసులు తెలిపారు.
దీంతో సాయివరప్రసాద్‌ను విశాఖలో అరెస్టు చేశారు. కోర్టు అతడికి అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతడు విశాఖపట్నం జిల్లా జైలులో ఉన్నాడు.
ప్రదీప్ ముఖర్జీపై కూడా ఆరోపణలు
రెండో నిందితుడు ప్రదీప్ ముఖర్జీ. అతడు విశాఖపట్నం నేవల్ బేస్‌కు చెందిన నేవీ ఉద్యోగి.
ప్రదీప్‌ను తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ కోసం వాట్సాప్ అకౌంట్ యాక్టివేట్ చేసేందుకు ఓటీపీ షేర్ చేశాడని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది.
అంతేకాదు.. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో కమ్యూనికేషన్ కొనసాగిస్తూ నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చాడని అధికారులు తెలిపారు.
కోయంబత్తూరు స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడలోని సంబంధిత కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు ప్రదీప్‌కు కూడా అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం అతడు విజయవాడ జిల్లా జైలులో ఉన్నాడు.
నేవీ ఉద్యోగులను ఉచ్చులోకి దించిన పాక్ మహిళా ఏజెంట్లు
భారత రక్షణ రహస్యాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ నిఘా విభాగం ఇద్దరు మహిళలను రంగంలోకి దించినట్టు అధికారులు గుర్తించారు.
వారు నకిలీ పేర్లతో నేవీ ఉద్యోగులకు పరిచయం అయ్యారని తెలిపారు. జోషితా పాల్, అన్వి మెహతా అనే పేర్లతో సోషల్ మీడియా ద్వారా నేవీ సిబ్బందితో పరిచయం పెంచుకున్నట్టు గుర్తించారు.
మొదట ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిచయం ఏర్పరచుకునేవారు. ఆ తర్వాత వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా సంబంధాన్ని కొనసాగించేవారు.
క్రమంగా నేవీ ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించేవారని అధికారులు తెలిపారు. సమాచారం అందించిన వారికి డబ్బులు ఇస్తామని ఆశ చూపేవారని గుర్తించారు.
సమాచారం పంపిన తర్వాత క్రిప్టో కరెన్సీ, ఇతర హవాలా మార్గాల ద్వారా డబ్బులు అందేవని అధికారులు గుర్తించారు.
జోషితా పాల్ పేరుతో పరిచయం
జోషితా పాల్ అనే నకిలీ పేరుతో ఉన్న పాక్ ఏజెంట్ తనను ముంబైలోని ఓ నౌకా నిర్మాణ సంస్థలో ఉద్యోగినిగా పరిచయం చేసుకుంది.
ఫేస్బుక్ ద్వారా నేవీ అధికారులు, ఉద్యోగులతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా వారితో మాట్లాడింది.
మాయమాటలతో వారిని నమ్మించేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు.
భారత్‌కు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలు, కమాండింగ్ ఆఫీసర్ల వివరాలు పంపాలని కోరినట్టు గుర్తించారు.
సమాచారం ఇస్తే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపేదని అధికారులు తెలిపారు.
అన్వి మెహతా పేరుతో మరో వల
మరో పాక్ ఏజెంట్ అన్వి మెహతా అనే నకిలీ పేరును ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు.
తనను దిల్లీకి చెందిన సైకాలజిస్ట్‌గా పరిచయం చేసుకున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా నౌకాదళ అధికారులతో పరిచయం పెంచుకుంది.
వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా నేవీ ఉద్యోగులతో సంబంధాలు కొనసాగించినట్టు గుర్తించారు.
ఆ తర్వాత నేవీలోని నౌకల ఫొటోలు, వీడియోలు పంపాలని కోరినట్టు అధికారులు తెలిపారు. వీడియో కాల్స్ సమయంలో నౌకలను చూపించాలని కూడా అడిగినట్టు గుర్తించారు.
ఈ విధంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి పాక్ నిఘా విభాగానికి పంపేవారని అధికారులు తెలిపారు.



