1. కాలేయ ఆరోగ్యానికి మేలు
క్రమం తప్పకుండా కాఫీ తాగేవారిలో ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి కాలేయ సమస్యల ముప్పు తక్కువగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, శరీరంలో దీర్ఘకాలిక వాపు వంటి అంశాలపై కాఫీలోని కొన్ని సమ్మేళనాలు ప్రభావం చూపవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాలేయ వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదం 49 శాతం తక్కువగా ఉంటుందని డాక్టర్ అర్జున్ శంకరన్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఈ గణాంకం అధ్యయనాల్లో గుర్తించిన సంబంధాన్ని సూచిస్తుంది.
కాఫీ తాగితే కాలేయ వ్యాధులు పూర్తిగా నివారించవచ్చని దీని అర్థం కాదు.
2. టైప్-2 మధుమేహం ముప్పు తగ్గే అవకాశం
కాఫీలోని పాలీఫీనాల్స్ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనివల్ల రక్తంలో చక్కెర నియంత్రణకు మేలు జరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం కాఫీ వినియోగంతో సంబంధం కలిగి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
డాక్టర్ శంకరన్ వివరాల ప్రకారం, రోజుకు ఒక కప్పు కాఫీ తాగేవారిలో టైప్-2 మధుమేహం ముప్పు 8 శాతం, రెండు కప్పులు తాగేవారిలో 15 శాతం, మూడు కప్పులు తాగేవారిలో 21 శాతం తక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.
కాఫీలో అధికంగా చక్కెర కలపడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే కాఫీలో చక్కెరను తగ్గించడం మంచిది.
ఇప్పటికే మధుమేహం ఉన్నవారు కాఫీతోనే రక్తంలో చక్కెర నియంత్రణ సాధ్యమవుతుందని భావించకూడదు.
3. మహిళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పుపై ప్రభావం
కాఫీ తాగే మహిళల్లో గర్భాశయం లోపలి పొరకు వచ్చే క్యాన్సర్ అయిన ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. అలాగే, ఈస్ట్రోజెన్ హార్మోన్ జీవక్రియపై కాఫీ ప్రభావం చూపవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
కాఫీ తాగని వారితో పోలిస్తే, మితంగా లేదా అధికంగా కాఫీ తాగే మహిళల్లో ఈ క్యాన్సర్ ముప్పు 20 నుంచి 29 శాతం తక్కువగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే, కాఫీని క్యాన్సర్ నివారణకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. అవసరమైన వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలి.
4. పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు తగ్గే అవకాశం
పార్కిన్సన్స్ వ్యాధి మెదడులోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్, ఇతర సమ్మేళనాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటంతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కెఫీన్ మెదడులోని కొన్ని నాడీ ప్రక్రియలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్రమం తప్పకుండా కాఫీ తాగేవారిలో పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు 37 శాతం తక్కువగా ఉంటుందని డాక్టర్ శంకరన్ తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే, ఈ సంబంధం ఆధారంగా కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి రాదని చెప్పలేం. వ్యాధి ముప్పుపై వయసు, జన్యుపరమైన అంశాలు, జీవనశైలి వంటి ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
5. గుండె ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు
కాఫీలోని పాలీఫీనాల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, దీర్ఘకాలిక వాపును తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇవి రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఉంది.
కాఫీ వినియోగం గుండె వైఫల్యం, గుండె స్పందనలో కొన్ని అసాధారణ మార్పులు తక్కువగా ఉండటంతో సంబంధం కలిగి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ కారణంగా మరణించే ప్రమాదం 19 శాతం తక్కువగా ఉంటుందని డాక్టర్ శంకరన్ పేర్కొన్నారు.
అయితే, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాఫీ ఒక్కటే సరిపోదు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం కూడా ముఖ్యమే.
మరీ వేడిగా ఉన్న కాఫీ తాగకూడదు
కాఫీ తాగే సమయంలో దాని ఉష్ణోగ్రతపై కూడా శ్రద్ధ పెట్టాలి. పొయ్యి మీద నుంచి దించిన వెంటనే మరీ వేడిగా ఉన్న కాఫీ తాగడం మంచిది కాదు.
65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను తరచుగా తాగడం ఆహార నాళ క్యాన్సర్ ముప్పుతో సంబంధం కలిగి ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన ఆందోళన కాఫీలోని కెఫీన్ కాదు. పానీయం మరీ వేడిగా ఉండటమే.
అందువల్ల కాఫీని కొంత చల్లారిన తర్వాత తాగాలి. నోటికి, గొంతుకు మంట కలిగించేంత వేడిగా ఉన్నప్పుడు తాగడం నివారించాలి.
రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?
డాక్టర్ శంకరన్ సూచన ప్రకారం, రోజుకు రెండు నుంచి మూడు చిన్న కప్పుల కాఫీ తీసుకోవచ్చు. చక్కెరను చాలా తక్కువగా కలపడం లేదా అసలు కలపకపోవడం మంచిది. అలాగే, నిద్రకు ఆటంకం కలగకుండా మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాఫీ తాగకుండా ఉండాలని ఆయన సూచించారు.
అయితే, ప్రతి ఒక్కరి శరీరం కెఫీన్‌కు ఒకే విధంగా స్పందించదు. కొందరికి తక్కువ మోతాదులో కాఫీ తాగినా గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు.
నిద్ర సమస్యలు ఉన్నవారు తమ అవసరాలకు అనుగుణంగా కాఫీ మోతాదును తగ్గించుకోవాలి.
గర్భిణులు, కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్నవారు కెఫీన్ తీసుకునే పరిమాణంపై వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


