అమెరికాలో సంచలనం.. OpenAIపై భర్త దావా
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ ChatGPT చుట్టూ మరో వివాదం మొదలైంది. తనను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించిందని, ఈ కుట్రకు ChatGPT సాయం చేసిందని ఆరోపిస్తూ ఒక వ్యక్తి OpenAI సంస్థపై కోర్టులో దావా వేశారు. ఈ కేసులో OpenAI CEO Sam Altmanను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈ ఘటన ఇప్పుడు టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
‘Bloomberg’ నివేదిక ప్రకారం.. నార్త్ కరోలినాకు చెందిన James Gates తన భార్య Cheryl Gatesపై ఈ ఆరోపణలు చేశారు. వీరిద్దరి మధ్య విడాకుల చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తనను విషం పెట్టి చంపేందుకు భార్య ప్రణాళిక రూపొందించిందని జేమ్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రణాళికకు అవసరమైన సమాచారాన్ని ఆమె ChatGPT ద్వారా సేకరించిందని ఆరోపించారు.
చేతిరాత నోట్‌తో బయటపడిన అనుమానాస్పద వ్యవహారం
2025 సెప్టెంబర్‌లో జేమ్స్ గేట్స్‌కు ఒక కీలకమైన ఆధారం లభించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన కొన్ని నెలల తర్వాత ఆయన తన భార్యకు చెందిన చేతిరాత నోట్‌ను గుర్తించారు. అందులో కొన్ని విషపదార్థాల పేర్లు ఉన్నాయి. వాటిని ఎంత మోతాదులో ఉపయోగించాలనే వివరాలు కూడా రాసి ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
ఆ నోట్ పైభాగంలో మరికొన్ని సూచనలు ఉన్నాయి. “చాట్‌జీపీటీ సంభాషణలన్నీ తొలగించు”, “లాగ్ అవుట్ చేయి” వంటి వాక్యాలు కనిపించాయి. దీంతో తనపై హత్యాయత్నం జరిగిందనే అనుమానం జేమ్స్‌కు బలపడింది.
అంతకుముందు ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. గుండె సంబంధిత లక్షణాలు, తీవ్రమైన కడుపునొప్పి, శారీరక బలహీనత ఎదురయ్యాయి. కొన్నిసార్లు స్పృహ తప్పేంత గందరగోళానికి గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
భార్యపై నమోదైన హత్యాయత్నం కేసు కొట్టివేత
జేమ్స్ గేట్స్ ఫిర్యాదు ఆధారంగా 2025లో చెరిల్ గేట్స్‌పై కేసు నమోదైంది. హత్యాయత్నం, ఆహారంలో విషం కలపడం వంటి అభియోగాలు ఆమెపై మోపారు.
అయితే, ఈ కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ప్రాసిక్యూటర్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును కొట్టివేశారు. దీంతో జేమ్స్ గేట్స్ మరో అడుగు ముందుకేశారు. తన భార్యకు ప్రమాదకరమైన సమాచారం అందించిందని ఆరోపిస్తూ ChatGPT తయారీ సంస్థ OpenAIపై నేరుగా దావా వేశారు.
ChatGPTతో మొదలైన సంభాషణలు.. ఆ తర్వాత ఏం జరిగింది?
దావాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెరిల్ గేట్స్ మొదట్లో తన వృత్తిపరమైన పనులు, ఇంటి పనులకు సంబంధించిన ప్రశ్నల కోసం ChatGPTని ఉపయోగించేవారు. అయితే, క్రమంగా తన వ్యక్తిగత జీవితంలోని సమస్యలను కూడా చాట్‌బాట్‌తో పంచుకోవడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా భర్తతో ఉన్న విభేదాలు, కుటుంబ సమస్యల గురించి చాట్‌బాట్‌కు వివరించినట్లు దావాలో పేర్కొన్నారు. తన భర్త తనపై నిఘా పెడుతున్నాడని, తనను వదిలేసి వెళ్లిపోతాడనే అనుమానాలను ChatGPT మరింత పెంచిందని జేమ్స్ ఆరోపించారు.
చాట్‌బాట్ ఆమె అభిప్రాయాలను ప్రశ్నించకుండా సమర్థిస్తూ, ఒక ఎకో ఛాంబర్‌లా పనిచేసిందని దావాలో పేర్కొన్నారు. ఈ విధంగా ఆమె అనుమానాలు మరింత బలపడ్డాయని ఆరోపించారు.
ఒలియాండర్ విషపూరిత లక్షణాలపై ప్రశ్నలు
దావాలో అత్యంత కీలకమైన అంశం ఒలియాండర్ మొక్కకు సంబంధించిన సంభాషణలు. చెరిల్ గేట్స్ ఈ మొక్క విషపూరితమా? అని ChatGPTని అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తన భర్త ఒలియాండర్ ఆకులను తనకు తెలియకుండా తినిపించే అవకాశం ఉందని, ఆత్మరక్షణ కోసం సమాచారం తెలుసుకుంటున్నట్లు ఆమె చాట్‌బాట్‌కు వివరించినట్లు దావాలో పేర్కొన్నారు.
అనంతరం విషపదార్థం ఎంత మోతాదులో ప్రమాదకరంగా మారుతుంది? దానిని ఎలా దాచవచ్చు? వంటి ప్రశ్నలు అడిగినట్లు ఆరోపించారు. ఈ ప్రశ్నలకు ChatGPT సమాధానాలు ఇచ్చిందని, అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా కోర్టులో సమర్పించినట్లు దావాలో వివరించారు.
మరో సందర్భంలో శవపరీక్షలో ఒలియాండర్ ఆనవాళ్లు బయటపడతాయా? అని ఆమె ప్రశ్నించినట్లు స్క్రీన్‌షాట్లలో ఉందని జేమ్స్ తరఫు దావా పేర్కొంది.
దీనికి ChatGPT స్పందిస్తూ.. “ఇది చాలా కీలకమైన ప్రశ్న – మీరు సరైన కారణంతోనే అడుగుతున్నారు” అని చెప్పినట్లు అందులో పేర్కొన్నారు. ఈ సంభాషణలు ఇప్పుడు కేసులో కీలక అంశంగా మారాయి.
OpenAI ఏమని స్పందించింది?
ఈ ఆరోపణలపై OpenAI స్పందించింది. వినియోగదారుల భద్రతకు తమ సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది.
ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులకు అవసరమైన సమాచారం అందించామని సంస్థ వెల్లడించింది. అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న Cheryl Gatesను తమ ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించినట్లు ప్రకటించింది.
అయితే, ఈ కేసులో కోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. జేమ్స్ గేట్స్ చేసిన ఆరోపణలు, OpenAI సమాధానం, కోర్టులో సమర్పించిన ఆధారాలు తదుపరి విచారణలో కీలకం కానున్నాయి.
AI కంపెనీల బాధ్యతపై మరోసారి చర్చ
ఈ కేసు కేవలం ఒక కుటుంబ వివాదానికి మాత్రమే పరిమితం కాలేదు. AI చాట్‌బాట్‌లు ఇచ్చే సమాచారానికి ఎంతవరకు బాధ్యత వహించాలి? అనే ప్రశ్నను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
గతంలో ఇలాంటి కేసుల్లో AI కంపెనీలు తమ వాదనలను కోర్టుల ముందు ఉంచాయి. చాట్‌బాట్‌లు రూపొందించే కంటెంట్ వాక్ స్వాతంత్ర్యం పరిధిలోకి వస్తుందని, వినియోగదారులు చేసే నేరాలకు AI సంస్థలను నేరుగా బాధ్యులను చేయలేమని కంపెనీలు వాదించాయి.
ఇప్పుడు OpenAI, CEO Sam Altmanపై దాఖలైన ఈ దావా కూడా టెక్నాలజీ సంస్థల బాధ్యతపై కీలక చర్చకు దారితీసే అవకాశం ఉంది.



