దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గోయల్, “‘స్వదేశీ’ అనే పిలుపు కేవలం భారత్‌లో వస్తువుల తయారీకి మాత్రమే పరిమితం కాదు. అది దేశ స్వావలంబన, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, ఇంధన వనరుల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం అత్యవసరం. కోవిడ్ మహమ్మారి సహా గత దశాబ్దంలో జరిగిన అనేక పరిణామాలు దీనిని స్పష్టంగా తెలియజేశాయి,” అని వివరించారు.“ఒకప్పుడు ప్రపంచానికి ‘బ్యాక్ ఆఫీస్’ లేదా ‘సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్’గా ఉన్న భారత్, ఇప్పుడు ప్రపంచ ఆవిష్కరణలకు ‘ఇంజిన్’గా మారుతోంది,” అని గోయల్ తెలిపారు
ప్రస్తుతం భారత్ చమురు, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాల వంటి కీలక రంగాల్లో విదేశాలపై ఆధారపడుతున్న నేపధ్యంలో, గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ అవసరాల్లో దాదాపు 90 శాతం సరఫరా తైవాన్ నుంచే వస్తోంది.ఈ ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడితో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. అదనంగా, ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
