గాయం నుంచి పూర్తిగా కోలుకున్న టీమ్ఇండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత ‘ఏ’ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్, ఒక విభిన్న కారణంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
మైదానంలోకి 18వ నెంబర్ జెర్సీతో అడుగు పెట్టిన పంత్ — అదే జెర్సీ నెంబర్‌తో ఆడిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీను అభిమానులు గుర్తు చేసుకున్నారు. సాధారణంగా పంత్ జెర్సీ నెంబర్ 17 అయినప్పటికీ, ఈసారి 18 నెంబర్ జెర్సీని ధరించడం చర్చనీయాంశమైంది.
కోహ్లీ ఇటీవల టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వన్డేల్లో ఇంకా కొనసాగుతున్నందున బీసీసీఐ ఆయన జెర్సీ నంబర్ 18ని రిటైర్ చేయలేదు. అందువల్ల, అందుబాటులో ఉన్న అదే నంబర్ జెర్సీని పంత్ ధరించి ఉండవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.గతంలో కూడా ముఖేశ్ కుమార్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత్ ‘ఏ’ తరఫున ఆడినప్పుడు 18వ నెంబర్ జెర్సీని ధరించాడు.
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండుల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) వంటి దిగ్గజాలు రిటైర్ అయిన తరువాత వారి జెర్సీ నంబర్లను బీసీసీఐ శాశ్వతంగా రిటైర్ చేసింది. కోహ్లీ విషయంలో ఇంకా నిర్ణయం రాకపోవడంతో, ఆయన నెంబర్ జెర్సీని మరో ఆటగాడు ధరించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.
