జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వాళ్ళ తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కేటీఆర్ వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, టీడీపీ లో సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాస్ నాయుడును బీఆర్ఎస్‌లోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని కానీ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిచిందని, సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందాయని చెప్పారు.
ప్రజలు పెట్టిన పదవులు భిక్షలంటూ, “ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు ప్రజల విశ్వాసంతోనే వస్తాయి. అలాంటి ప్రజలను బెదిరించడం సరికాదు” అని కేటీఆర్ అన్నారు. ఈ దేశంలో ఎన్టీఆర్, ఇందిరా గాంధీలను కూడా ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. “మూడు అడుగుల రేవంత్ రెడ్డి ఎంత?” అని ప్రశ్నిస్తూ, ఆయన తనను తాను చక్రవర్తిగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపేస్తామని బెదిరిస్తే, జూబ్లీహిల్స్ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.
“ముఖ్యమంత్రి అంటే ప్రజల సొమ్ముకు ధర్మకర్త. మన పదవి ఐదేళ్ల తాత్కాలిక ఉద్యోగం మాత్రమే. ప్రజలకు ఇష్టం లేకుంటే మనల్ని చెత్తబుట్టలో వేస్తారు” అని కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన సందర్భాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
