బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి హింసను సహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ స్పష్టం చేశారు. మోకామాలో జరిగిన హింసాత్మక ఘటనపై చర్యగా పట్నా గ్రామీణ ఎస్పీతో పాటు మరో ముగ్గురు అధికారులను కమిషన్ బదిలీ చేసింది.గ్యానేశ్ కుమార్ కాన్పూర్‌లో మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో జరిగే ఏ హింసకూ తావు ఉండదు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, భయంలేకుండా, పారదర్శకంగా ఓటు వేయగలుగుతారు” అన్నారు.
గత గురువారం మోకామాలో జరిగిన ప్రచార సమయంలో గ్యాంగ్‌స్టర్-టర్న్డ్ నేత దులార్‌చంద్ యాదవ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో జేడీయూ అభ్యర్థి ఆనంద్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
“ఎన్నికల కమిషన్ దృష్టిలో పక్షం–విపక్షం అనే తేడా లేదు, అందరూ సమానమే” అని ఆయన స్పష్టం చేశారు. 243 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ సిద్ధంగా ఉన్నారని, ఆయన తెలిపారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగగా, లెక్కింపు నవంబర్ 14న జరుగనుంది. ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
