ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా ద్వారా తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లండన్‌లో పారిశ్రామిక వేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, లాజిస్టిక్స్ కారిడార్‌ల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, ఈ నెల జరగనున్న పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనాలని పారిశ్రామిక వేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు అంతర్గత జలవనరుల్లో జల రవాణా అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.లండన్‌కి చెందిన ఆరుప్ సంస్థ జల రవాణా ప్రాజెక్టులపై పని చేయాలని సీఎం కోరారు. అలాగే అరుదైన ఖనిజాల వెలికితీతకు విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యం కావాలని సూచించారు.ఏపీలో టెక్నాలజీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్,అమరావతిలో ఏఐ క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు బ్రిటిష్ పరిశ్రమలు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

